23-21-21... సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కేంటంటే!
ఈ క్రమంలో తాజాగా ఆయన '23 నెలలు-21 లక్షల కోట్లు-21 లక్షల ఉద్యోగాలు' అంటూ.. లెక్కలు ప్రతిపాదించారు.
రాష్ట్ర అభివృద్ధిపై తనదైన విజన్ తో ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు పెట్టుబడుల కల్పన.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను.. ప్రభుత్వం ఏర్పడిన కాలంతో కొలుచుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన `23 నెలలు-21 లక్షల కోట్లు-21 లక్షల ఉద్యోగాలు` అంటూ.. లెక్కలు ప్రతిపాదిం చారు. కేవలం 23 నెల్లలోనే.. భారీ ఎత్తున పెట్టుబడులు సాధించామని.. అదేసమయంలో 21 లక్షల ఉద్యోగాలను కూడా దక్కించుకున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా జరగాలని, డిసెంబర్ 2028 కల్లా ప్రారంభమ య్యేలా చూడాలని నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ సహా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ఆచరణలో చూపాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో సమీక్షించారు.
ఎంఓయూల స్థితిగతులు, ప్రాజెక్టుల పురోగతిపై లోకేష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రుల కమిటీ తీసుకున్న చర్యలు, ప్రస్తుత కార్యాచరణ, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ 23 నెలల్లో రూ.21,64,258 కోట్ల విలువైన మొత్తం 756 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, వీటితో 21,20,567 ఉద్యోగాలు వస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగంలో ఏవియేషన్ ప్రాజెక్టులను ఆకర్షించేలా చర్యలు చేపడతామని లోకేష్ చెప్పారు.
పెట్టుబడుల సాధనలో దేశంలోనూ, ప్రైవేటు రంగంలోనూ ఏపీ పేరు మార్మోగుతోందని, ఎంఎస్ఎంఈల అనుమతులు, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో పెడతామని లోకేష్ అన్నారు. భూముల కేటాయింపుల్లో మొదటగా పర్యాటక ప్రాజెక్టులకు, తర్వాత ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. టూరిజం, ఐటీ లాంటి ప్రాజెక్టులకు వినూత్నంగా మల్టీ పర్పస్ భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచన చేయాలని సూచించారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్ ను గోవా ప్లస్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేయాలని ఆదేశించారు.
ఏపీలోని 21 ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం ప్రాజెక్టు వేగంగా చేపట్టాలని సీఎం చెప్పారు. ఐటీ ప్రాజెక్టులు తమ కార్యకలాపాలు 18 నెలల్లో ప్రారంభించేలా చూడాలన్నారు. సెమీ కండక్ట ర్స్, ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ తయారీ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు.