ఆ ధైర్యమే తమ్ముళ్లను మైనస్ చేస్తోందా.. ?
రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలపై టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబుకు అసంతృప్తి ఉంది. అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలపై టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబుకు అసంతృప్తి ఉంది. అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులకు.. నాయకులు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు.. పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిన్నటి వరకు నాలుగు గోడల మధ్యకే పరిమితమైన ఈ వ్యవహారాన్ని వేదికలపైకి తీసుకువెళ్తున్నారు.
ఏం జరుగుతోంది.. ?
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు .. ఎవరికి వారు అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యేలు.. ఎంపీలకు మద్య చాలా నియోజకవర్గాల్లో గ్యాప్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే అంటే ఎంపీకి, ఎంపీ అంటే ఎమ్మెల్యేకీ పడడం లేదు. ఎవరికి వారు తామే గొప్ప అని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉండాల్సిన ఐక్యత, కలివిడి తనం వంటివి కనిపించడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఒకప్పుడు ఎంపీలు.. ఎమ్మెల్యేలకు మధ్య మంచి వాతావరణం ఉండేది. కానీ, ఇప్పుడు లేదు.
పైగా.. మరో రీజన్.. తమ తర్వాత.. ఎవరు? అనే ప్రశ్న. అంటే.. నియోజకవర్గంలో తాము తప్ప.. పోటీకి అర్హులు ఎవరూ లేరని.. తామే బలవంతులమనే వాదన బలంగా ఎమ్మెల్యేలకు ఉంది. ఏం చేసినా.. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. వచ్చే ఎన్నికల్లోనూ తమకు టికెట్లు ఖాయమని భావిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ ధైర్యమే వారిని మైనస్ చేస్తోంది. ఇది కూడా వాస్తవమే. ప్రస్తుతం నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లు కూడా వారే ఉన్నారు. జిల్లా ఇంచార్జ్‌లకు-ఎమ్మెల్యేలకు మధ్య సంధాన కర్తలు కూడా లేరు.
అంతర్గతంగా ఏం జరుగుతోందో తెలియదు కానీ.. జిల్లాల ఇంచార్జ్‌ల మాట కూడా ఎమ్మెల్యేలు పట్టించుకో వడం లేదు. ఏదైనా పార్టీ కార్యక్రమం జరిగితే.. తామే నిధులు ఇస్తున్నామని.. కార్యకర్తలకు కూడా తామే ఇస్తున్నామని.. కాబట్టి తమ మాటేనెగ్గాలన్న ధోరణి కనిపిస్తోంది. ఇక, క్షేత్రస్థాయిలో ఇతర నాయకులను కూడా ఎదగనివ్వకపోవడానికి ఇదే రీజన్‌గా కనిపిస్తోంది. పైగా.. పార్టీ కూడా.. నియోజకవర్గాల వారీగా.. ఇద్దరు నేతలకు సపోర్టు చేస్తే.. అధికార కేంద్రాలు ఏర్పడతాయని భావిస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు. స్వతంత్రులుగా మారుతున్నారన్న వాదన ఉంది.