'33 శాతాన్ని' ముందే అమలు చేసిన చంద్రబాబు!
దేశవ్యాప్తంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై గురువారం నుంచి చర్చజరుగుతున్న క్రమంలో అసలు ఈ 33 శాతాన్ని తానే ముందుగా అమలు చేసి చూపించారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.;
దేశవ్యాప్తంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై గురువారం నుంచి చర్చ జరుగుతున్న క్రమంలో అసలు ఈ 33 శాతాన్ని తానే ముందుగా అమలు చేసి చూపించారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. మహిళా రిజర్వేషన్‌కు ఆది నుంచి మొగ్గు చూపుతున్న సీఎం.. తాజాగా తన పార్టీ విషయంలో తానే ముందుగా నిర్ణయం తీసుకుని.. ఇతర పార్టీలకు.. ఇతర నాయకులకు కూడా ఆదర్శంగా నిలిచారు. మహిళలకు టీడీపీలో ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన మరింత పెంచారు.
తాజాగా.. టీడీపీని సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. పలు కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. అలానే.. వీటికి అనుబంధంగా జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10 మంది చొప్పున నియమించారు. ఇక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-ఏడుగురు, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77 మంది ఉన్నారు.
ఇలా మొత్తం టీడీపీని 185 మందితో కమిటీల వారీగా తీర్చిదిద్దారు. ఈ కమిటీల్లో 50 మంది మహిళలకు చోటు కల్పించారు. ఫలితంగా 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసినట్టు అయింది. మరీ ముఖ్యంగా మండలస్థాయికి చెందిన నాయకురాలికి పార్టీకి అత్యంత కీలకమైన పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. గజపతినగరం మండల టీడీపీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి ఈ బ్యూరోలో అవకాశం చిక్కించుకున్నారు.
ఈమెతో పాటు.. పలువురు కొత్త మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. ఎలా చూసుకున్నా.. పార్టీలో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం గమనార్హం. ఇక, 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారు. బీసీ వర్గానికి చెంది-77 మందికి, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం ఇచ్చారు. మరో విశేషం ఏంటంటే.. ఈ నెల ఆఖరు నాటికి ఈ కమిటీలను ప్రకటించాలని భావించినప్పటికీ.. పార్లమెంటు సమావేశాలకు ముందే.. ఈ కమిటీలను ప్రకటించడం ద్వారా మహిళా రిజర్వేషన్ కల్పనలో తన నిబద్ధతను చంద్రబాబు చాటుకున్నట్టు అయింది.