సరదా పందెంతో.. 27 ఏళ్ల నడక.. రికార్డు సాధించిన ధీరుడు..
ఈ ప్రయాణంలో అతడికి కొత్త స్నేహాలు దొరికాయి, కొత్త సంస్కృతులు పరిచయమయ్యాయి. కొందరు భోజనం పెట్టారు, మరికొందరు భోజనంతో పాటు ఆశ్రయం ఇచ్చారు, మరికొందరు కథలు విన్నారు.;
ఫ్రెండ్స్ మధ్య సరదాగా వేసుకున్న ఓ చిన్న పందెం.. ఒక మనిషి జీవితాన్నే మార్చేసింది. ‘ఇది సీరియస్‌గా తీసుకోవద్దు’ అని ఫ్రెండ్స్ చెప్పినా కార్ల్ బుష్ మాత్రం పట్టించుకోలేదు.. ఆ నవ్వే అతడిని 27 ఏళ్ల పాటు నడిపించింది. అక్షరాలా నడకే అతడి జీవితమైంది. సౌత్ అమెరికా నుంచి ఇంగ్లండ్ వరకు కాలినడకన ప్రయాణించాలన్న ఆలోచన వినడానికి కూడా అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ అదే సవాలును నిజం చేశాడు కార్ల్ బుష్ (Carl Bush). 1998లో మొదలైన ఈ ప్రయాణం.. ఎండలు, వానలు, అడవులు, ఎడారులు, పర్వతాలు, నగరాలు అంటూ భూమ్మీద ఉన్న ప్రతి రంగును చూసుకుంటూ సాగింది. అప్పటికి అది ఒక అడ్వెంచర్ మాత్రమే. కానీ కాలం గడిచేకొద్దీ అది జీవనతత్వంగా మారిపోయింది.
ఫ్రెండ్స్ తో సరదాగా పందెం..
ప్రారంభంలో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఈ పందెం మొదలైంది. ‘నిజంగా నడిచి ఇంగ్లండ్ చేరగలవా?’ అన్న తన ఫ్రెండ్స్ ప్రశ్నే అతడిలోని మొండితనాన్ని రగిలించింది. స్నేహితులు మధ్యలోనే వదిలేయమన్నారు. ప్రయాణం ప్రమాదకరం అన్నారు. జీవితం దారి తప్పుతుందన్నారు. కానీ కార్ల్ బుష్ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అది అప్పటికే అతడి గౌరవంతో ముడిపడిపోయింది. ఈ 27 ఏళ్లలో అతడు ఎదుర్కొన్న కష్టాలకు లెక్కలేదు. డబ్బుల్లేని రోజులు ఉన్నాయి, ఆకలితో నడిచిన రాత్రులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో సరిహద్దులు దాటడానికి అనుమతులు దొరకలేదు. కొన్ని చోట్ల భద్రతా సమస్యలు ఎదురయ్యాయి. అయినా ప్రతి అడుగు ముందుకే వేసాడు. ‘నడక ఆపితే నేను నేనుగా ఉండను’ అన్న భావన అతడిని నడిపించింది.
27 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు..
ఈ ప్రయాణంలో అతడికి కొత్త స్నేహాలు దొరికాయి, కొత్త సంస్కృతులు పరిచయమయ్యాయి. కొందరు భోజనం పెట్టారు, మరికొందరు భోజనంతో పాటు ఆశ్రయం ఇచ్చారు, మరికొందరు కథలు విన్నారు. ఈ ప్రయాణం అతడికి ప్రపంచాన్ని చూపించడమే కాదు.. మనుషుల మధ్య మానవత్వాన్ని కూడా నేర్పింది. ఇప్పుడు ఆ ప్రయాణానికి ముగింపు సమీపిస్తోంది. 1998లో మొదలైన కార్ల్ బుష్ నడక.. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. సౌత్ అమెరికా నుంచి ఇంగ్లండ్ వరకూ నడిచిన ఈ ప్రయాణం కేవలం భౌగోళిక దూరాన్ని మాత్రమే కాదు.. సంకల్ప బలాన్ని కూడా కొలిచింది. కార్ల్ బుష్ కథ ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది.. ఇతరులు సరదాగా అన్న మాటను నువ్వు నమ్మితే, అది నీ జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది. పందెంగా మొదలైంది.. పట్టుదలతో కొనసాగితే చరిత్రగా మారుతుందన్నదానికి ఇదే సజీవ ఉదాహరణ.
కష్టనష్టాలకు ఓర్చి..
ఈ ప్రయాణంలో కార్ల్ బుష్ తన శరీరాన్ని మాత్రమే కాదు, తన మనసును కూడా పరీక్షించుకున్నాడు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వయసు పెరిగింది, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యాయి. పాదాలకు గాయాలు, మోకాళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు.. ఇవన్నీ అతడిని పలుమార్లు ఆపాలని ప్రయత్నించాయి. కానీ ‘ఇక్కడే ఆగిపోతే, ఈ 27 ఏళ్లకు అర్థం ఉండదు’ అనే ఆలోచనే అతడిని మళ్లీ ముందుకు నడిపించింది. కొన్నిసార్లు రోజుకు కొన్ని కిలోమీటర్లు మాత్రమే నడిచాడు. మరికొన్నిసార్లు వారాలపాటు ఒకే ప్రాంతంలో ఆగాల్సి వచ్చింది. అయినా ప్రయాణం ఆగలేదు.. వేగం తగ్గింది అంతే.
కాలక్రమేణా ఈ నడక వ్యక్తిగత ప్రయాణం నుంచి ఒక తాత్విక ప్రయాణంగా మారింది. కార్ల్ బుష్‌కు ఈ ప్రయాణం ద్వారా విజయం అంటే గమ్యస్థానం కాదు అని అర్థమైంది. ప్రతి రోజు వేసే అడుగే విజయం అని గ్రహించాడు. ప్రపంచం ఎంత పెద్దదో, మనిషి సంకల్పం అంతకంటే పెద్దదని అతడి జీవితం నిరూపించింది. సెప్టెంబర్‌లో ఈ ప్రయాణం ముగిసినప్పుడు, అతడు కేవలం ఇంగ్లండ్ చేరిన వ్యక్తిగా కాకుండా.. పందేన్ని నమ్మి, జీవితాన్ని నడిచిన వ్యక్తిగా గుర్తుండిపోతాడు. ఇది ఒక మనిషి కథ కాదు.. ‘నమ్మకం ఉంటే అసాధ్యం అనేదే ఉండదు’ అన్న సత్యానికి నడిచే సాక్ష్యం.