కోతుల బెడద.. వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల మధ్య ఢిల్లీ కీలక నిర్ణయం!

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆగస్టు 17 నుంచి 23 వరకు బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఎంతో ఘనంగా జరగనున్నాయి.

Update: 2026-08-11 06:36 GMT

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆగస్టు 17 నుంచి 23 వరకు బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఎంతో ఘనంగా జరగనున్నాయి. అయితే గతంలో జరిగిన టోర్నీలలో కోతులు, పావురాల వల్ల మ్యాచ్‌లకు పదే పదే అంతరాయం కలగడం నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈసారి అలాంటి ఇబ్బందులు రాకూడదని నిర్వాహకులు చాలా వింతైన, వినూత్నమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఇబ్బంది కలగకుండా తీసుకుంటున్న ఈ చర్యలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే..

కోతులను భయపెట్టేందుకు 'మంకీ విస్పరర్స్':

స్టేడియం పరిసరాల్లో కోతుల బెడదను నివారించడానికి నిర్వాహకులు ప్రత్యేకంగా ముగ్గురు 'మంకీ విస్పరర్'లను నియమించారు. వీరు కొండముచ్చుల అరుపులను అచ్చంగా అనుకరిస్తూ కోతులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. ఇక కోతులు లోపలికి రాకుండా ఉండేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహాయంతో ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

పావురాల బెడదకు అమెరికా జెల్, సౌండ్ మెషిన్లు:

గతంలో జరిగిన ఇండియా ఓపెన్ పోటీల్లో పావురాలు కోర్టులోకి వచ్చి మ్యాచ్‌లను రెండుసార్లు ఆపేలా చేశాయి. ఈసారి ఆ సమస్య రాకుండా స్టేడియం వెంట్లన్నింటినీ మూసివేశారు. డబుల్ డోర్ వ్యవస్థను తెచ్చారు. అంతేకాకుండా, అమెరికా నుంచి విష రహిత జెల్‌ను తెప్పించి పూశారు. అలాగే వేట పక్షుల అరుపులను వినిపించే ప్రత్యేక యంత్రాలను కూడా స్టేడియంలో అమర్చారు.

స్పందించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు:

ఈ వింతైన, వినూత్నమైన ఏర్పాట్లపై భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికరంగా స్పందించింది. "ఈ పరిష్కారాలు చూస్తే ఎవరికైనా నవ్వు రావచ్చు. కానీ తెర వెనుక ఉండి పడుతున్న శ్రమను మెచ్చుకోవాల్సిందే. ఇక మన దేశం పాటించే సంప్రదాయ పద్ధతులు, ఇచ్చే ఆతిథ్యం చాలా ప్రత్యేకమైనవి" అని రాసుకొచ్చింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కూడా ఈ స్టేడియంలో చేసిన భద్రతా ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చేస్తున్న ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ క్రీడాకారులకు మంచి అనుభూతిని ఇస్తాయని భావిస్తున్నారు. ఇక మ్యాచ్‌లు ఎలాంటి అంతరాయం లేకుండా దిగ్విజయంగా సాగాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News