ఉద్యమం నుంచి రాజకీయం.. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు.. అత్యంత సాదాసీదా

అయితే, 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో అత్యంత సాదాసీదాగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటోంది.

Update: 2024-04-27 09:57 GMT

సరిగ్గా 23 ఏళ్ల కిందట.. 2001 ఏప్రిల్ 27.. ఎర్రటి ఎండలు.. అలాంటి సమయంలో పుట్టిందో ఉద్యమ పార్టీ. తీవ్రమైన ప్రతిఘటనలను ఎదుర్కొంటూ పద్నాలుగేళ్లకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. పదేళ్లు అధికారంలో ఉంది. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారింది. పార్టీ స్థాపన తొలి పదేళ్లు ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నదో ఇప్పుడూ అలాంటి స్థితిలోనే ఉంది. అయితే, 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో అత్యంత సాదాసీదాగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటోంది.

తెలుగు నాట రికార్డు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. సినిమాల్లో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి నుంచి ఉమ్మడి ఏపీలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ వరకు ఎందరో పార్టీలను స్థాపించారు. వీరిలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు దివంగత మహా నటుడు ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీకి దక్కింది. అది కూడా కేవలం 9 నెలల్లొ అధికారం అనే రికార్డు ఇప్పటికీ చెరగకుండా నిలిచింది. ఇలాంటి రికార్డు కాస్త ఆలస్యమైనా టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)కు దక్కింది. తెలుగు నేలపై పుట్టిన ఒక ప్రాంతీయ పార్టీ అధికారం దక్కించుకోవడం అనే ఘనత టీడీపీ తర్వాత టీ(బీ)ఆర్ఎస్ కు మాత్రమే సాధ్యమైంది.

కష్టాలను ఎదురీదుతూ 2001 నాటికి ప్రత్యేక తెలంగాణ సాధన అనే దాదాపు అసాధ్యమైన లక్ష్యంతో బరిలో బరిలో దిగిన బీఆర్ఎస్ 2014 నాటికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. దాదాపు పదేళ్లు అధికారంలో కొనసాగింది. ఇటీవలి ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఒక వైపు నాయకులు వెళ్లిపోతుండగా మరోవైపు ఎమ్మెల్యేలూ చేజారుతుండగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ శనివారం ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గాయం నుంచి కోలుకుని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు.

ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. 'మా పార్టీ పుట్టుక సంచలనం. దారి పొడవునా రాజీలేని రణం' అంటూ కేడర్ కు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ను అభివర్ణించారు. పార్టీ ప్రస్థానం అనితర సాధ్యమని కొనియాడారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీగా, ఈ నేల మేలు కోరేది బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగాన్ని కొనియాడారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని కేటీఆర్‌ ట్వీట్ లో అభివర్ణించారు.

4

ఎన్నికల కోడ్ తో నిరాడంబరంగా..?

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏటా తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే, ఎన్నికల కోడ్ కారణంగానో ఏమో ఈసారి దూరంగా ఉన్నారు. అందులోనూ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైల్లో ఉండడంతో ఇది నిజంగా క్లిష్ట సమయంగా మారింది. ఈ గడ్డు కాలాన్ని అధిగమించాలంటే.. లోక్ సభ ఎన్నికల్లో గౌరవనీయ సీట్లు సాధించడం అత్యంత ముఖ్యం.

Tags:    

Similar News