కేసీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారా ?

అటువంటి అసాధ్యాన్ని కేసీఆర్ సుసాధ్యం చేశారు. తన చాణక్య రాజకీయంతో వ్యూహాలతో తెలంగాణాలో రాజకీయ పక్షాలను ఉద్యమ దిశగా నడిపించారు.;

Update: 2025-04-27 03:46 GMT

కేసీఆర్ అన్న మూడు అక్షరాలు తెలంగాణా మలి విడత ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఆయన దగ్గరుండి మొత్తం ఉద్యమాన్ని నడిపించారు. వాస్తవంగా చూస్తే ఉద్యమానికి రాజకీయానికి చుక్కెదురు. పక్కనే ఉన్నా కలవని పట్టాల మాదిరిగా ఈ రెండూ ఉంటాయి.

అటువంటి అసాధ్యాన్ని కేసీఆర్ సుసాధ్యం చేశారు. తన చాణక్య రాజకీయంతో వ్యూహాలతో తెలంగాణాలో రాజకీయ పక్షాలను ఉద్యమ దిశగా నడిపించారు. ప్రత్యేక రాష్ట్రం వద్దు అని విముఖంగా ఉన్న పార్టీల చేత సుముఖంగా మారేలా చూశారు. జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పి తెలంగాణా సాధించారు.

ఆ ఫలాలను పదేళ్ళ పాటు అధికారంలో ఉంటూ కేసీఆర్ దక్కించుకున్నారు. మరి బీఆర్ఎస్ ఓడింది. అంతటితో అయిపోయినట్లేనా అన్న చర్చ సాగుతూ వస్తోంది. ఎందుకంటే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ ఎస్ కి ఒక్క ఎంపీ సీటు దక్కలేదు. దాంతో ఇక అంత సీన్ లేదన్న కామెంట్స్ వచ్చాయి.

అయితే ఇటీవల కాలంలో మళ్ళీ బీఆర్ ఎస్ ఊపు కనిపిస్తోంది. నేతలు బయటకు వస్తున్నారు. ఇపుడు చూస్తే బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా కీలకమైన మైలు రాయి వద్ద ఉంది. పార్టీ పుట్టి పాతికేళ్ళు అయింది. దాంతో ఈ రజతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పోరుగడ్డ ఓరుగల్లు వేదికగా ఈ ఉత్సవాలని జరుపుతున్నారు.

ఇక ఈ ఉత్సవాలలో హైలెట్ ఏమిటి అంటే కేసీఆర్. ఆయన రావడం చాలా సేపు సభా వేదిక మీద ఉండడమే అతి పెద్ద ఆకర్షణ. ఇక ఆయన వాడి వేడి ప్రసంగం ఎటూ మరింత ఆకర్షణగా ఉంటుంది అన్నది కూడా జనాలు అంటారు.

అయితే కేసీఆర్ ఏమి మాట్లాడుతారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు పదునుగా ఉంటాయని అంటున్నారు. అంతే కాదు బీఆర్ఎస్ భవిష్యత్తు గురించి కూడా దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ఇక అన్నింటికంటే అతి ముఖ్యమైనది సంచలనమైనది జాతీయ స్థాయిలో సైతం ఆకర్షించే విషయం ఒకటి ఉంది అని అంటున్నారు.

అదే బీఆర్ ఎస్ పేరు మార్పు అని చెబుతున్నారు. బీఆర్ఎస్ ని తిరిగి టీఆర్ఎస్ గా మారుస్తారు అని అంటున్నారు. ఆ విధంగా మార్చితేనే పూర్వ వైభవం దక్కుతుందని పార్టీ పేరులో కచ్చితంగా తెలంగాణా ఉండాలని అంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. దానికి కేసీఆర్ కూడా అంగీకరించారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా పేరు మార్చుకుని తన పాత సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుంది అని అంటున్నారు.

తొందరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ గానే పోటీ చేస్తుందని చెబుతున్నారు. మరి కేసీఅర్ ఆ ప్రకటన చేస్తారా లేదా అన్నదే చర్చ. అదే జరిగితే మాత్రం రజోత్సవ వేళ బీఆర్ ఎస్ సరికొత్త మలుపు తీసుకున్నట్లే ఆ పార్టీ దశ తిరిగినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News