బీఆర్ఎస్ ముందు రాజకీయ గండాలు
ఉద్యమ పార్టీ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా టీఆర్ఎస్ ని పరుగులు పెట్టించారు. ఆ ఊపుని వేడిని ఏకంగా పద్నాలుగేళ్ల పాటు కొనసాగించారు.;
టీఆర్ఎస్ గా ఏర్పాటు అయి బీఆర్ఎస్ గా మారి ఈ ఏడాదే పాతికేళ్ళ పండుగను ఘనంగా వరంగల్ లో గులాబీ పార్టీ జరుపుకుంది. అయితే ఆ తరువాతనే ఎక్కడ లేని కష్టాలు బీఆర్ఎస్ కి వచ్చి పడుతున్నాయి. ఏనాడైనా ఊహించారా కేసీఆర్ సొంత కుమార్తె కవిత పార్టీ మీద కత్తులు దూస్తుందని. అంతే కాదు ఏ రోజు అయినా అనుకున్నారా పార్టీలో కీలక నేతల మీద అవినీతి ఆరోపణలు వస్తాయని కధ కాస్తా సీబీఐ విచారణ దాకా వెళ్తుందని. పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాని పరిస్థితి ఉంటుందని కలలో అయినా అనుకున్నారా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధులను పెట్టలేని నిస్సహాయతకు చేరుకుంటారని కూడా భావించారా అన్నదే ఆ పార్టీలో చర్చగా ఉంది.
ఊపుతో వేడితో :
ఉద్యమ పార్టీ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా టీఆర్ఎస్ ని పరుగులు పెట్టించారు. ఆ ఊపుని వేడిని ఏకంగా పద్నాలుగేళ్ల పాటు కొనసాగించారు. ఒక్కడుగా వచ్చి ఎందరినో పోగేసి వేలు లక్షల గొంతుకగా తెలంగాణా నినాదాన్ని మార్చి అందులో తాను సారధిగా పగ్గాలు చేపట్టి గల్లీ నుంచి ఢిల్లీ దాకా గడగడలాడించిన కేసీఆర్ అంటే ఒక ప్రకంపన అన్నది ఒకనాటి పేరు. ఇపుడు సొంత కుమార్తె ఆయనను ధిక్కరించి దూరం కావడం రాజకీయ విచిత్రం అనాలో విధి వైపరిత్యం అనాలో కూడా అర్ధం కాని పరిస్థితి గా ఉంది అని అంటున్నారు.
మెడకు కాళేశ్వరం :
కాళేశ్వరం తెలంగాణా తల్లి సిగలో అలంకారం అవుతుందని కేసీఆర్ భావించారు. అది కాస్తా చివరికి తమ మెడకే చుట్టుకుని అవినీతి ఆరోపణల హారంగా మారుతుందని పెను భారంగా సైతం నిలుస్తుందని అసలు ఊహించలేకపోయారు. పీసీ ఘోష్ ఏకంగా ఏణ్ణర్థం పాటు విచారణ జరిపి ఆరు వందల పేజీల నివేదిక ఇస్తే అందులో ఉన్నది అంతా ప్రజా ధనం దుర్వినియోగం చేసారని అతి భారీ వడ్డీలకు అప్పులు చేశారు అని. దాంతోనే బీఆర్ఎస్ ఇబ్బంది పడింది. అయితే తెలంగాణా అసెంబ్లీలో చర్చ కాస్తా ధాటీగా సాగిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం సీబీఐ విచారణకు అప్పగించడం. దాంతోనే మొత్తం వ్యవహారం ఇపుడు బీఆర్ఎస్ కి ఉచ్చుగా మారబోతుందా అన్నదే హాట్ టాపిక్ గా ఉంది.
సవాళ్ళ నుంచి సంక్షోభాలతో :
ఏ ముహూర్తాన టీఆర్ఎస్ ని కాస్తా బీఆర్ఎస్ గా మార్చారో తెలియదు కానీ సవాళ్ళు ఎదురవుతున్నాయి. అవి కాస్తా పెను సంక్షోభాలకు దారి తీస్తున్నాయి. 2023 ఎన్నికల్లో భారీ పరాజయం అన్నది యాధృచ్చికం అనుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఓటమి నుంచి విజయం వైపుగా సాగుతామన్న ధీమా ఎంతగా పెంచుకున్నా దానికి తగిన మౌలికమైన బలం మాత్రం దక్కడంలేదు. ఈలోగా పార్టీలో సంక్షోభాలు కుటుంబంలో అంతర్గత సంఘర్షణలు అన్నీ కలసి గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
కేసీఆర్ లో భయమా :
ఎన్నో ఉద్యమాలను చేశారు, చూశారు, మరెన్నో పోరాటాలను ధీటుగా ఎదుర్కొన్నారు. అలాంటి కేసీఆర్ లో తొలిసారి భయం కనిపిస్తోందా అంటే జవాబు ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు కానీ పెద్దాయన అయితే టెన్షన్ లో ఉన్నారనే ప్రచారం మాత్రం జరుగుతోంది అంటున్నారు. ఇక సీబీఐ విచారణ వద్దు అని హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేయడంతో జనాలలో కూడా డౌట్లు పెరిగిపోతున్నాయి. ఏ తప్పూ చేయకపోతే విచారణ సీబీఐతో చేస్తే ఏమిటి మరో సంస్థతో చేస్తే ఏమిటి అన్న చర్చ వస్తోంది. మొత్తం మీద సీబీఐ తో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది అంటున్నారు. ఇక చూస్తే పార్టీలో కవిత ఎపిసోడ్ అన్నది ఆరంభమే అని ముందు ముందు మరిన్ని రాజకీయ గండాలు ఉంటాయని కూడా అంటున్నారు అంటే బీఆర్ఎస్ ఏ విధంగా తట్టుకుని సాగుతుందో చూడాల్సి ఉంది.