ఆధిక్యంలో బొత్స కోడలు పూజిత
| జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత పోస్టల్ బ్యాలెట్లలో 12 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోడలు సంధ్యపై ఆధిక్యంలో ఉన్నారు. గరివిడి పట్టణంలోని నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో మూడింట వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే బ్యాలెట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకపోవడంతో తుది ఫలితంపై స్పష్టత రావాల్సి ఉంది.
జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బొత్స పూజిత 12 ఓట్ల మెజార్టీతో తన సమీప అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలు సంధ్యపై ఆధిక్యం ప్రదర్శించారు. అయితే ఇంకా బ్యాలెట్ల పేపర్లను లెక్కించాల్సివుంది. ప్రస్తుతం బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతున్నారు. మరోవైపు బొత్స కోడలు పూజిత పోటీ చేసిన గరివిడి జడ్పీటీసీ పరిధిలోని ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గరివిడి పట్టణంలో నాలుగు ఎంపీటీసీలు ఉండగా, మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగడం ఆసక్తికరంగా మారింది.
తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో పట్టునిలుపుకోవాలని సీనియర్ నేత బొత్స ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తన మేనల్లుడు, జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిన తర్వాత చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీని రక్షించుకునే పనిని బొత్స తన భుజస్కందాలపై వేసుకున్నారు. దీంతో జడ్పీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలో నాలుగు స్థానాలు ఉండగా, రెండు చోట్ల సొంత కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. గరివిడి నుంచి కోడలు పూజిత, గుర్ల మండలం నుంచి సోదరి వెంకటలక్ష్మిని పోటీలో పెట్టారు. అదేవిధంగా నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి నుంచి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కుమారుడు వంశీకృష్ణను అభ్యర్థిగా నిలిపారు.
అయితే చీపురుపల్లి నియోజకవర్గంలో మొత్తం నాలుగు స్థానాలకు రెండు చోట్ల వైసీపీ ఆధిక్యం ప్రదర్శించేలా ఉందని ప్రాధమిక లెక్కలు చెబుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులకు ఆధిక్యం రాగా, ఎంపీటీసీ స్థానాల్లో సైతం వైసీపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బొత్స కోడలు పూజిత పోటీ చేస్తున్న గరివిడి మండలంలోని గరివిడి పట్టణంలో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని, ఇది తక్కువ మెజార్టీతో అయినా ఆమెను గట్టు ఎక్కించేలా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంకా లెక్కింపు మొదలు కానందున అప్పుడే తుది ఫలితం అంచనా వేయలేమని అంటున్నారు. కానీ, ప్రాథమిక సమాచారం ప్రకారం బొత్స కోడలు పూజిత ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే కళా వెంకటరావుకి కోలుకోలేని దెబ్బ తీసినట్లేనని భావిస్తున్నారు.