బొత్స దుస్సాహసం ఫలితం
| వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి చవిచూడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆమెను జెడ్పీ చైర్మన్ చేయాలన్న బొత్స ఆశలకు ఈ ఫలితం గండికొట్టింది. చీపురుపల్లి పరిధిలోని గుర్ల, గరివిడి వంటి అనుకూల ప్రాంతాల్లో కాకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం పరిధిలో పోటీ చేయించడమే ఓటమికి కారణమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
విజయనగరం జిల్లాకే పెద్ద నాయకుడు, ఉత్తరాంధ్ర రాజకీయాలలో సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ దుస్సాహసం చేసిన దానికి ఫలితం అలా వచ్చిందా అన్న చర్చ నడుస్తోంది. కుమార్తె బొత్స అనూష రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో అనివార్యమైన పరిస్థితుల వల్లనో ఒత్తిడి రాజకీయాల వల్లనో బొత్స తీసుకున్న ఆ నిర్ణయం ఇపుడు కుమార్తె అనూష రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసింది అని అంటున్నారు. బొత్స అనూషని జెడ్పీ చైర్మన్ చేయాలన్నది పెద్దాయన ఉద్దేశ్యం. అంతవరకూ బాగానే ఉంది. కానీ చిన్న శ్రీను ఎపుడైతే వైసీపీ నుంచి దూరం అయ్యారో అధికార కూటమి వైపుగా చేరిపోయారో ఆనాడే బొత్స పునరాలోచన చేసి ఉండాల్సింది అన్న చర్చ నడుస్తోంది.
బలమైన మోహరింపు :
ఇక చూస్తే మూడు పార్టీలతో కూటమి నిలిచి ఉంది. అంగబలం అర్ధ బలం కూడా తోడు అయినాయి. ఈ సమయంలో వైసీపీలో భారీ చీలిక వచ్చింది. కుడి భుజంగా ఉన్న నాయకుడు చిన్న శ్రీను పార్టీని వీడిపోయాడు. ఈ విపత్కర పరిస్థితులలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే బొత్సకు ఈ పుత్రికా పరాజయ శోకం తప్పి ఉండేది కదా అని అంతా అంటున్నారు. కానీ ఆయన ఏమనుకున్నారో లేక తన బలం చూపించాలని భావించారో తెలియదు కానీ అధికారం లేని చోట అధికులమనరాదు అన్నట్లుగా ఆయన పాచికలు పారలేదు, అనుకున్న కోరిక కూడా తీరలేదు, చివరికి బొత్స అనూష తొలి ప్రయత్నంలోనే పరాజితురాలిగా మారిపోవడం మాత్రం ఆయన కుటుంబానికే కాదు ఆ యువ నాయకురాలి రాజకీయ జీవితానికి కూడా ఆదిలోనే అడ్డుకట్ట వేసిందా అన్న చర్చ సాగుతోంది.
అక్కడ నిలబెట్టినా :
సరే బొత్స ఎక్కడా వెనక్కి తగ్గాలనుకోలేదు అనుకున్నా తన కుమార్తెకి సేఫ్ జోన్ లాంటి చీపురుపల్లి లోని గుర్ల కానీ గరివిడి కానీ మండలాల నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయించి ఉంటే గెలిచే వారు కదా అన్న చర్చ కూడా వస్తోంది. ఎందుకంటే గుర్ల నుంచి బొత్స సొంత చెల్లెలు లక్ష్మి ఇంతటి కూటమి ప్రభంజనంలోనూ గెలిచి వచ్చారు. అలాగే కోడలు బొత్స పూజిత కూడా గరివిడిలో ఏకంగా మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్యను ఓడించి మరీ మొదటి సారిలోనే విజయం అందుకున్నారు. ఒక చోట కోడలు మరో చోట కూతురుని పెట్టినా బొత్సకు ఈ అపజయం తాలూకా మనో వేదన ఉండేది కాదని అంటున్నారు. పైగా చీపురుపల్లి లోని ఈ మండలాల నిండా బొత్స బంధుగణం అనుచర గణం దండీగా ఉంది. కాబట్టి గెలుపు సులువు అయ్యేది అని అంటున్నారు.
మంత్రి ఇలాకాలోనే :
ఇక పోయి పోయి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలోనే బొత్స అనూష చేత పోటీ చేయించారు. గజపతినగరం బొత్స సోదరుడు అప్పలనరసయ్యను రెండు సార్లు గెలిపించిన సీటు, అంతే కాదు మరో రెండు సార్లు ఓడించిన సీటు కూడా అదే. అక్కడ గతంలో మాదిరిగా పరిస్థితులు లేవని అంటున్నారు. టీడీపీ పుంజుకుంది. జనసేన తోడు అయింది. పైగా అప్పలనరసయ్య పార్టీ పట్టుని పెంచే ప్రయత్నం గట్టిగా చేయలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి నియోజకవర్గంలో బొండపల్లి నుంచి జెడ్పీటీసీగా అనూషని పోటీ చేయించడం వల్ల ఆమె ఓటమి చవి చూడాల్సి వచ్చింది అని అంటున్నారు. దీంతో ఆమెను గొప్ప పదవిలో చూడాలనుకున్న బొత్స ఆశలకు కూడా గండి పడినట్లు అయింది అని విశ్లేషిస్తున్నారు.