బొలిశెట్టి లొల్లి: జ‌న‌సేన‌కు గెయినెంత ..!

బొలిశెట్టి శ్రీనివాస్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున తొలిసారి విజయం దక్కించుకున్నారు.;

Update: 2025-08-20 04:00 GMT

బొలిశెట్టి శ్రీనివాస్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున తొలిసారి విజయం దక్కించుకున్నారు. సామాజిక వర్గంపరంగా మంచి పేరున్న బొలిశెట్టి రాజకీయంగా జనసేనకు మరింత దన్నుగా మారుతారని అప్పట్లో అందరూ భావించారు. ముఖ్యంగా బొలిశెట్టి సామాజిక వర్గానికి మరింతగా అండగా ఉంటారని అనుకున్నారు. పార్టీ పరంగా కూడా ఆయనకు ఒకప్పుడు మంచి మార్కులు ఉండేవి. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తీరు మారిపోయింది. ఆయనను సమర్థిస్తున్న వారు కూడా ఇప్పుడు ఆయనను విమర్శించే పరిస్థితి వచ్చింది.

అంతేకాదు, పార్టీ నాయకులు కూడా ఆయన వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నట్టు పార్టీలోనూ చర్చ జరుగుతోంది. నిజానికి జనసేన పార్టీ తరఫున ఆది నుంచి మంచి వాయిస్ వినిపించిన నాయకుల్లో బొలిశెట్టి ఫ్యామిలీ ఒకటి. ఇదే గత ఏడాది ఎన్నికల్లో ఆయనకు టికెట్ వచ్చేలా చేసింది కూడా ఇదే. అయితే గెలిచిన తర్వాత ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. వివాదాలకు కేంద్రంగా.. వివాదాస్పద వ్యాఖ్యలకు సెంటర్ గా బొలిశెట్టి శ్రీనివాస్ మారిపోయారు అనే మాట సొంత పార్టీ నాయకులు నుంచే వినిపిస్తోంది. సాధారణంగా ప్రత్యర్థులు విమర్శలు చేశారంటే అర్థం ఉంటుంది. కానీ, సొంత పార్టీ నాయకులు యావ‌గించుకునేలాగా విమర్శించుకునేలాగా ఆయన వ్య‌వ‌హ‌స్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

గతంలో మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేయటం, అదే విధంగా సొంత పార్టీ నేతలపైనే దూకుడుగా వ్యవహరించడం వంటివి వివాదానికి దారి తీశాయి. అంతేకాదు కూటమిలో ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. జనసేన లేకపోతే టిడిపి లేదని, టిడిపి ఈరోజు గెలిచిందంటే జనసేన కారణంగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రెండు పార్టీల మధ్య వివాదానికి దారి తీశాయి. దీంతో చంద్రబాబు సైతం టిడిపి నాయకులను హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా వంగవీటి రంగా హత్యకు సంబంధించిన వ్యవహారంపై బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.

రంగా హత్య వెనుక అప్పటి ప్రభుత్వం ఉందంటూ బొలిశెట్టి పరోక్షంగా టిడిపిని మరోసారి టార్గెట్ చేశారు. దీనిపై స్థానిక టిడిపి నాయకులు మండిపడుతున్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బొలిశెట్టి ఏం చేయాలనుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. నిగ్ర‌హం పాటిస్తున్నామని, లేకపోతే బొలిశెట్టిని టార్గెట్ చేయడం పెద్ద విషయం కాదని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇక జనసేన పార్టీలోనూ బొలిశెట్టి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. పార్టీపరంగా మేలు చేసేలాగా ఆయన వ్యవహరించాలని తాను ఎమ్మెల్యే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నాయకులు సూచిస్తున్నారు. మొత్తంగా బొలిశెట్టితో జనసేనకు ప్రయోజనమా లేకపోతే ఇబ్బందులా అంటే ప్రస్తుతం ఆయన వల్ల ఇబ్బందులేనన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట. మరి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News