బీసీల కోసం.. బోడే ధ‌ర్మ దీక్ష‌.. !

మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్" వేదికగా "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగనుంది.;

Update: 2026-04-04 10:07 GMT

బీసీ సామాజిక వ‌ర్గాల అభ్యున్న‌తే ల‌క్ష్యంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ `ధ‌ర్మ దీక్ష‌`కు రెడీ అవుతున్నారు. ఈ నెల 11 నుంచి ఆయ‌న ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు రెడీ అవుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. గ‌తంలో నిర్వ‌హించిన‌ "బీసీ సింహగర్జన" సభలో ఐదు కీలక డిమాండ్లను ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే.. వాటిపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌ని చెబుతున్న బోడే.. ఇప్పుడు ఏకంగా వాటి సాధ‌న కోసం ధ‌ర్మ దీక్ష‌కు రెడీ అయ్యారు.

మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్" వేదికగా "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగనుంది. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర ఈ దీక్షకు పూనుకొంటున్నార‌ని బీసీవై పార్టీ పేర్కొంది. బీసీల సహనాన్ని పరీక్షించవద్దని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాల ని బీసీవై పార్టీ కోరింది. ఈ `ధర్మ దీక్ష`కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు త‌ర‌లి రావాలని పార్టీ పిలుపునిచ్చింది.

ఐదు డిమాండ్లు ఇవే..

1) బీసీ రక్షణ చట్టం: బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా "బీసీ రక్షణ చట్టాన్ని" వెంటనే అమలు చేయాలి.

2) అమరావతిలో భూమి: రాజధాని అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు, ఇతర అవసరాల కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాలి.

3) సమగ్ర కులగణన: రాష్ట్రంలో శాస్త్రీయ ప్రాతిపదికన సమగ్ర కులగణన చేపట్టి, బీసీల కచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలి. త‌ద్వారా వారికి ప్ర‌త్యేక సంక్షేమ ఫ‌లాలు అందించాలి.

4) 44% రిజర్వేషన్లు: విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. జ‌నాభాలో ఎక్కువ‌గా ఉన్న బీసీల‌కు న్యాయం చేయాలి.

5) బీసీ కార్పొరేషన్లకు నిధులు: బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి. త‌ద్వారా బీసీ కుటుంబాలు.. త‌లెత్తుకుని జీవించే అవ‌కాశం క‌ల్పించాలి.

Tags:    

Similar News