నీలి తిమింగలాలు.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు!
తాజాగా శాస్త్రవేత్తలు నీలి తిమింగలాల స్వరంలో గణనీయమైన తగ్గుదలను గుర్తించారట..;
సాధారణంగా కొన్ని విషయాలపై పరిశోధన ఎలా ఉంటుందంటే.. పరిశోధనలో వెలువడే ఆ ఫలితాలు భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందోనని.. అసలేం జరుగుతుందో అని.. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి ఒక పరిశోధనే చేశారు శాస్త్రవేత్తలు.. అది కూడా నీలి తిమింగలాల మీద. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా శాస్త్రవేత్తలు నీలి తిమింగలాల స్వరంలో గణనీయమైన తగ్గుదలను గుర్తించారట.. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. సముద్రం అడుగుల్లో ఉండే శబ్దాలను రికార్డు చేయడానికి రూపొందించిన కొన్ని ప్రత్యేకమైన మైక్రోఫోన్ లను సముద్రంలోకి పంపారట. అయితే ఈ మైక్రోఫోన్ల ద్వారా బయటపడింది ఏమిటంటే..నీలి తిమింగలాల శబ్దాలలో గణనీయమైన తగ్గుదలను శాస్త్రవేత్తలు గమనించారట. అయితే సముద్రంలోకి పంపించిన ఈ మైక్రోఫోన్లు సముద్ర జీవుల జీవనాన్ని ట్రాక్ చేయడమే కాకుండా వాటి మనుగడ ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తాయి. ఈ మైక్రోఫోన్లు మానవ కార్యకలాపాలు, వివిధ జాతులను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
నీలి తిమింగలాల శబ్దాలలో గణనీయమైన తగ్గుదల ఏర్పడడానికి కారణం.. తీవ్రమైన సముద్ర ఉష్ణతరంగాలు తిమింగలాల వాతావరణాన్ని దెబ్బతీశాయని,అలాగే సముద్రపు ఆహార వలయంలో గొలుసు ప్రతి చర్యకు కారణమయ్యాయని కనుగొన్నారు. ఈ వేడి తరంగాలు విషపూరితమైన ఆల్గే పుష్పాలకు దారి తీసాయని,ఈ ఆల్గే పుష్పాలు సముద్రపు క్షీరదాలను విషపూరితం చేయడమే కాకుండా క్రిల్ అండ్ ఆంకోవీస్ వంటి కీలక ఆహార వనరులను తుడిచిపెట్టేసాయని కనుగొన్నారు. అంతేకాదు ఇప్పటివరకు నమోదు చేయబడిన సముద్రపు క్షీరదాలలో అత్యంత విస్తృతమైన విష ప్రయోగానికి కారణమైందని కూడా మాంటేరి బే అక్వేరియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జీవ శాస్త్రవేత్త అయినటువంటి జాన్ రాన్ తెలిపారు..
గత దశాబ్దాలతో పోల్చుకుంటే నీలి తిమింగలాల శబ్దాలు దాదాపు 40 శాతం తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. నీలి తిమింగలాలు ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని కనుగొనడం కోసం పాట పాడతాయి. అలా పాడిన సమయంలో ఈ నీలి తిమింగలాల స్వరం చాలా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఈ సమస్య ది బ్లాబ్ అని పిలవబడే వెచ్చని నీటి ప్రదేశంలో ప్రారంభమైందని తెలియజేశారు. 2013లో ఈ సమస్యను మొదటగా గుర్తించారు. ఆ తర్వాత 2016 నాటికి 2000 మైళ్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న ఒక భారీ ప్రాంతంగా ఇది పెరిగిందని, దీనికి కారణం పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలే అంటూ ఆయన తెలియజేశారు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీలి తిమింగలాలకు ఆహార పదార్థాలు అందడం లేదని,ఈ సముద్ర ఉష్ణ తరంగాలు పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.
దీని కారణంగా నీలి తిమింగలాలు ఆహారం తక్కువ తిని పునరుత్పత్తికి తక్కువ కృషి చేస్తాయని, ఫలితంగా నీలి తిమింగలాల జాతి కూడా క్రమక్రమంగా తగ్గిపోతుందని తెలియజేశారు. అలాగే మానవులు చేసే కార్యకలాపాల వల్ల వాతావరణంలో మార్పు సంభవించి, అది మహా సముద్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సైన్స్ చెబుతోంది.కానీ ఈ మహా సముద్రాల నుండి భవిష్యత్తు తరాలు నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలా నీలి తిమింగలాల స్వరంలో మార్పు శాస్త్రవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తోందని జాన్ రాన్ తెలియజేశారు.