రథయాత్రలకు రెడీ అయ్యిందా ?

ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూజలు చేసి యాత్రలకు పచ్చజెండా ఊపబోతున్నారు.

Update: 2024-02-20 10:30 GMT

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ మళ్ళీ రథయాత్రలకు రెడీ అవుతోంది. 17 పార్లమెంటు స్ధానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. మంగళవారం నుండి ఒకేసారి నాలుగు క్లస్టర్లలో రథయాత్రలు ఆరంభవుతున్నాయి. 12 రోజులు 4238 కిలోమీటర్లను రథయాత్రలతో కవర్ చేయాలన్నది బీజేపీ ప్లాన్. ఇందుకు రూటుమ్యాపులను కూడా రెడీచేసుకున్నది. ఏ క్లస్టర్ కు ఎవరు ఇన్చార్జి, రథయాత్రలను లీడ్ చేయాల్సిన నేతలు కూడా రెడీ అయిపోయారు.

బీజేపీ తన రథయాత్రలకు విజయసంకల్పయాత్రగా పేరుపెట్టుకున్నది. ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూజలు చేసి యాత్రలకు పచ్చజెండా ఊపబోతున్నారు. వరంగల్ జిల్లాలో జరగబోతున్న మేడారం జాతర కారణంగానే ఐదో రథయాత్ర కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను రథయాత్రల్లో కవర్ చేయబోతున్నారు. రథయాత్రల ముగింపుసభ సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. దానికి నరేంద్రమోడి హాజరవుతారని పార్టీవర్గాల సమాచారం.

Read more!

ఒక యాత్రకు కిషన్ రెడ్డి, మిగిలిన వాటికి ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ, ఈటల రాజేందర్ నాయకత్వం వహించబోతున్నారు. రాథయాత్రల్లో బీజేపీ ఎక్కువగా రోడ్డుసైడ్ మీటింగులు, ర్యాలీలపైన బాగా దృష్టిపెట్టింది. ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీమ్ క్లస్టర్ యాత్ర బాసర అమ్మవారి పూజల తర్వాత మొదలవుతుంది. రెండో యాత్ర వికారాబాద్ జిల్లా తాండూరులో మొదలవుతుంది. మూడో యాత్ర భువనగిరి నుండి మొదలవ్వబోతోంది. నాలుగోది మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నుండి మొదలవుతుంది.

ఐదో యాత్ర సమ్మక్క-సారలక్క జాతర కారణంగా ఆలస్యమవుతుంది. అయితే ఈ యాత్ర భద్రాలచంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో పూజలు చేసుకుని బయలుదేరుతుంది. ప్రతి రథయాత్ర కూడా సగటున 22 నియోజకవర్గాలను కవర్ చేసేట్లుగా అగ్రనేతలు ప్లాన్ చేశారు. కేంద్రమంత్రులు ఈ యాత్రలను ప్రారంభించబోతున్నారు. మొత్తంమీద పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పెద్ద కసరత్తే చేస్తోంది. మరి ఫలితాలు ఎలాగ ఉండబోతున్నాయన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇపుడున్న నాలుగు ఎంపీ స్ధానాలకు మించి గెలిస్తేనే కష్టం ఫలించినట్లు. లేకపోతే అనుభవం వచ్చిందని సరిపెట్టుకోవాల్సిందే.

Tags:    

Similar News