బీజేపీలోకి విజయసాయి...మాధవ్ ఫుల్ క్లారిటీ !
ఏపీలో వైసీపీతో బీజేపీకి ఎలాంటి లోపాయికారీ స్నేహం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.;
ఏపీలో వైసీపీతో బీజేపీకి ఎలాంటి లోపాయికారీ స్నేహం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. వైసీపీని తాము రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామని అన్నారు. ఒక ప్రముఖ తెలుగు చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాధవ్ మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. జగన్ మీద ఉన్న కేసులు అన్నీ విచారణ దశలో ఉన్నాయని కాపాడాల్సిన అవసరం బీజేపీకి లేదని ఆయన అన్నారు. బీజేపీ వైసీపీ అరాచక పాలనను వ్యతిరేకిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉందని అన్నారు.
విజయసాయి విషయంలో :
వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి బీజేపీలోకి చేరేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని అన్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారని గుర్తు చేశారు. వైసీపీలో ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పారని అన్నారు. విజయసాయిరెడ్డి వస్తాను అంటే తాము చేర్చుకోవడానికి కూటమి పార్టీలతో చర్చించాల్సి ఉంటుందని అన్నారు. కూటమి పార్టీలు అన్నీ కలసి ఆలోచించిన మీదటనే విజయసాయిరెడ్డి లాంటి నేతల చేరిక విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే గతంలో ఆయన వైసీపీ నేతగా గీత దాటి వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయని చెప్పారు.
బీజేపీ ఎదుగుతుంది :
ఏపీలో బీజేపీ ఎదుగుతోందని మాధవ్ అన్నారు. దానికి తగిన రాజకీయ వాతావరణం ఉందని చెప్పారు. తాము కూటమిలో భాగస్వామిగా ఉంటూనే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మా బలం పెంచుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అన్ని నిర్ణయాలు కలసి కూర్చుకుని తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని ఆ వెసులుబాటు తమకు ఉందని అన్నారు. ఏపీలో మంచి పాలన సాగాలని తాము కోరుకుంటున్నామని కేంద్రంలో నరేంద్ర మోడీ ఏపీలో చంద్రబాబుల నాయకత్వంలో డబుల్ ఇంజన్ పాలన సాగుతోంది అని మాధవ్ చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని బాగా పెంచుకుంటుందని అన్నారు.
అసంతృప్తి సహజం :
కూటమి పార్టీలలో ఉన్న నేతలలో చిన్న అభిప్రాయ భేదాలు సహజం అని మాధవ్ అన్నారు. అయితే అవి పార్టీ వేదికల మీదనే చర్చించి సజావుగా పరిష్కారం కనుగొంటామని అన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమ్మగా పాలన ఉందని చేసిన వ్యాఖ్యల మీద తానుగా వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. మూడు పార్టీలు ఉన్నపుడు అందరికీ అన్నీ జరుగుతాయని లేదని ఒక కుటుంబంలోనే అసంతృప్తి ఉంటుందని మాధవ్ అన్నారు. ఏపీ ఈ రోజున దేశంలో అభివృద్ధి పధంలో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. దానికి మోడీ బాబు జోడీయే కారణం అన్నారు.
హిందూత్వ అస్త్రం కాదు :
హిందూత్వను బీజేపీ నమ్ముతోందని అయితే అది రాజకీయ అస్త్రం కాదని ఆయన చెప్పారు. సనాతన ధర్మం గురించి జనసేన అధినేత పవన్ మాట్లాడిన తీరు బాగుందని తాము మొదటి నుంచి ఈ విషయాలు మాట్లాడినా పవన్ ఒక సెలిబ్రిటీ కాబట్టి ఆయన మాటలకు ఎక్కువ ఫోకస్ వచ్చిందని అన్నారు. హిందూత్వ అజెండా అంటూ లేదని భారత దేశంలో అంతా కలసి ఉండాలన్నదే బీజేపీ విధానం అని మాధవ్ చెప్పారు. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో బీజేపీ సైలెంట్ గా లేదని అదే సమయంలో లడ్డూ అపవిత్రం అయింది అన్న దాని మీద బీజేపీ గట్టిగా గళమెత్తిందని మాధవ్ చెప్పారు. ఏపీలో అమరావతి రాజధానికి బీజేపీ మద్దతుగా ఉందని పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుందని చెప్పారు. ఏపీ కొత్త రాష్ట్రంగా ఉందని కేంద్రం ఈ విషయంలో అన్ని విధాలుగా ఆదుకుంటోందని మాధవ్ చెప్పారు. చంద్రబాబు అనుభవం కూడా దానికి ఉపయోగపడుతోందని అన్నారు. ఏపీలో బీజేపీకి రానున్న కాలంలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. తమ సత్తాను బట్టి వచ్చే ఎన్నికల్లో సీట్లను కోరుతామని అన్నారు.