మినిస్ట‌ర్ 'వ‌ర్మ' గారిని ప‌ట్టించుకోండ‌బ్బా ..!

బిజెపి నుంచి నరసాపురం ఎంపీగా విజయం దక్కించుకున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ.. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.;

Update: 2025-09-09 15:30 GMT

బిజెపి నుంచి నరసాపురం ఎంపీగా విజయం దక్కించుకున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ.. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 15 మాసాలకు పైగా ఆయన ఈ పదవి తీసుకుని మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాజకీయ వర్గాల్లో ఆయనపై పెద్దగా వార్తలు ఏమి రాకపోవడం.. ఆయన గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోకపో వడం నరసాపురం లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా బిజెపి వర్గాల్లో చర్చగా మారింది. వాస్తవానికి ఒక పార్టీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడికి సముచిత గౌరవం ఉంటుంది. స్థానికంగా కూడా ప్రాధాన్యం ఉంటుంది.

అయితే, భూపతి రాజు శ్రీనివాస‌ వర్మ విషయానికి వచ్చేసరికి ఆయన నియోజకవర్గంలోనే ఆయనను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ బిజెపిలో వినిపిస్తోంది. వాస్తవానికి ఇటువంటి చర్చ టిడిపిలో ఉన్న కేంద్ర మంత్రుల విషయంలో మనకు కనిపించదు. వినిపించ‌దు కూడా. శ్రీకాకుళం నుంచి విజయం దక్కించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు... గుంటూరు పార్లమెంటు నుంచి విజయం దక్కించుకున్న పెమ్మ‌సాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ నియోజకవర్గానికి వచ్చినప్పుడు టిడిపి నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. స్వాగతాలు పలుకుతున్నారు.

అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో కూడా వారితో క‌లిసి సీనియ‌ర్లు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. అయితే.. ఈ తరహాలో చూసినప్పుడు భూపతి రాజు శ్రీనివాస‌ వర్మకు కూటమి నాయకుల నుంచి అంత సపోర్టు గాని, అంత ఆహ్వానాలు, ఆడంబరాలు కానీ ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఆయన ఏమన్నా వీటిని వద్దన్నారా.. అంటే అది లేదు. 

వాస్త‌వానికి నరసాపురం అంటే కీలక నియోజకవర్గం. పలు వ్యాపారాల‌కు కేంద్రం. గ‌తంలో ఎంపీగా ప‌నిచేసిన బీజేపీ నేత గోక‌రాజు గంగ‌రాజు.. కేంద్రంలో మంత్రిగా లేక‌పోయినా.. అంద‌రికీ చేరువ‌గా ఉండేవారు. అదేవిధంగా నియోజ‌క‌వ‌ర్గానికి రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. రహదారుల అభివృద్ధి చేశారు. ఆక్వా ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఆక్వా సమస్యకు కొంతవరకు పరిష్కారం కూడా చూపించారు. కానీ, భూపతి రాజు శ్రీనివాస‌ వర్మ విజయం దక్కించుకున్న తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత అసలు పెద్దగా ఎక్కడ వార్తలలో కనిపించడం లేదు .

దీంతో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ బీజేపీలో ఆయనకు పెద్ద హవా అయితే కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ కేంద్రమంత్రి స్థాయిలో భూపతి రాజు శ్రీనివాస‌ వర్మ స్థానికంగా ప్రజలను గాని, స్థానికంగా నాయకులను కానీ ఆకట్టుకోలేకపోతున్నారన్నది బిజెపి నాయకుల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. దీనికి ఆయ‌న ఎలాంటి విరుగుడు మంత్రం క‌నిపెడ‌తారో చూడాలి. చివ‌రిగా ఒక్క‌మాట‌.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చివ‌రి నిముషంలో ఈయ‌న టికెట్ ద‌క్కించుకున్న విష‌యం గుర్తుండే ఉంటుంది.

Tags:    

Similar News