ఏపీలో ఈ పొలిటికల్ 'రాజు'ల బాధలు చూశారా...?
కానీ, ఆ నాయకులకు సంబంధించిన కీలకమైన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇదీ ఇప్పుడు ఇద్దరు రాజు నాయకులు వ్యక్తం చేస్తున్న ఆవేదన.;
వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అధికారంలో ఉన్నాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ చక్రం తిప్పుతున్నాయి. కానీ, ఆ నాయకులకు సంబంధించిన కీలకమైన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇదీ ఇప్పుడు ఇద్దరు రాజు నాయకులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు విశాఖ ఉత్తరం నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పడుతున్న ఆవేదన.
కానీ, వారు పెడుతున్న గగ్గోలు మాత్రం పార్టీలకు వినిపించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. విష్ణుకు మార్ రాజు విషయానికి వస్తే వైసిపి హయాంలో చేసిన పనులకు సంబంధించి ఇంతవరకు తనకు బిల్లులు రాలేదన్నది వాస్తవం. నిజానికి వైసీపీతో తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగించింది కూడా బిల్లుల విషయంలోనే అన్నది ఆయన స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. కానీ, 15 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు విష్ణుకుమార్ రాజు బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయలేదు. ఏదో కొద్దిపాటి బిల్లులను మాత్రం ఇచ్చినప్పటికీ మెజారిటీగా 80 కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు రావాల్సి ఉందని రాజుగారు స్వయంగా చెబుతున్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన మానసికంగా తట్టుకోలేకపోతున్నారు. బిజెపి నాయకులు అదేవిధంగా బిజెపి మంత్రికి ఈ విషయం చెప్పినా కూడా పట్టించుకోవడం లేదన్నది విష్ణుకుమార్ రాజు ఆవేదన. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇక, ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే గతంలో వైసిపి హయాంలో నమోదైన కేసు అనంతరం జరిగిన టార్చర్ వంటి పరిణామాలపై ఆయన ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా అప్పటి సిఐడి చీఫ్ గా వ్యవహరించిన సునీల్ ను చట్టం ముందు నిలబెట్టాలి.. కఠినంగా శిక్షించాలని రాజు గారి లక్ష్యం. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి తనకు సరైన మద్దతు లేదన్నది ఆయన మాటల్లో వ్యక్తం అవుతున్న ఆవేదన. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజుగారు ఇదే విషయం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సునీల్ బీహార్ లో పనిచేస్తున్నారని.. అక్కడ న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్ర పరిధి నుంచి ఆయనను తప్పించడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఏది ఏమైనా ఇద్దరు రాజులూ కూడా తమ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆవేదనలో ఉన్నారు. దీంతో ఇద్దరు కూడా అంతర్గతంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుని వీరి సమస్యలను పరిష్కరిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.