బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ.. ఎవరికి ఇష్టం.. ఎవరికి కష్టం..?
అయితే ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో ఎదగాలంటే అనుసరించాల్సిన వ్యూహంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.;
తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా? మున్సిపల్ ఎన్నికల తరువాత అధికార కాంగ్రెస్ మరింత బలోపేతం అయినట్లు కనిపిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు అయిన బీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా డీలాపడ్డాయని అంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో ఎదగాలంటే అనుసరించాల్సిన వ్యూహంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి బద్ద విరోధిగా చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఎదగలేకపోతోంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచిపోయింది. అయితే బీజేపీ ఎదగాలన్నా, బీఆర్ఎస్ మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవాలన్నా ఆ రెండు పార్టీలు చేతులు కలపాలన్న విశ్లేషణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ వైఖరే అంతుచిక్కడం లేదని అంటున్నారు.
నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ చాలా కాలంగా ఉవ్విళ్లూరుతోంది. బీఆర్ఎస్ ను గద్దె దించి ఆ స్థానంలో కమలం సర్కారు తీసుకురావాలని కాషాయ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రెండు పార్టీల మధ్యలోకి దూసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికార పీఠం తన్నుకెళ్లిపోయింది. ఆ తర్వాత రెండు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైచేయి సాధిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వాదన నెగ్గడానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రజాక్షేత్రంలో బోల్తాకొట్టడానికి 2023 ఎన్నికల్లో ప్రయోగించిన ఒక వ్యూహమే అంటున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య స్నేహం ఉందని, ఆ రెండు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పూర్తిస్థాయిలో విజయవంతం అయింది. ఈ ప్రచారం వల్ల బీజేపీ పూర్తిగా కుదేలు అవగా, బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇప్పటికీ కోలుకోలేకపోయింది. ఎన్నికల అనంతరం కూడా ఇదే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నారని అంటున్నారు. దీనికి పావుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతరు కవితను వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ యంత్రాంగం ప్రయత్నిస్తోందని కవిత గతంలో చేసిన ప్రకటన ఆ రెండు పార్టీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అంటున్నారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రెండు పక్షాలు పోరాడటం వల్ల ప్రభుత్వ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతోందని విశ్లేషిస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 40 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 29 శాతం, బీజేపీకి 16 శాతం ఓట్లు పోలయ్యాయి. వేర్వేరుగా చూస్తే రెండు పార్టీలు అధికార పార్టీకి దరిదాపుల్లో లేవంటున్నారు. కానీ రెండు పార్టీల ఓట్లు ఉమ్మడిగా లెక్కిస్తే కాంగ్రెస్ పార్టీకన్నా 4 శాతం ఓట్లు అధికంగా వచ్చాయని అంటున్నారు. అదేసమయంలో స్వతంత్రులు, ఇతరులకు కలిపి 9 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇందులో అత్యధికంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగానే లెక్కిస్తున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరుగా ఉండటమే తనకు శ్రేయస్కరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఆ రెండు పార్టీలు దగ్గర అవకుండా ఉండేలా రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రదర్శిస్తున్న రాజకీయ చాణక్యమే చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం సీఎం రేవంత్ రెడ్డి పాలిట వరంలా మారిందని అంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తుకు సిద్ధమైన బీజేపీ.. తెలంగాణలో మాత్రం ఎవరితోనూ పొత్తుకు సాహసించడం లేదు. ఈ కారణంగానే ఆ పార్టీ వెనకబెంచీకి పరిమితం కావాల్సివస్తోందని అంటున్నారు.
అయితే బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం ససేమిరా అనడం వల్ల ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని అంటున్నారు. ఇది అంతిమంగా రెండు పార్టీలకు నష్టం చేస్తోందని అంటున్నారు. ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో బీజేపీ గులాబీ పార్టీ ప్రతిపాదనలను తిరస్కరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ పరిణామం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా లాభిస్తోందని అంటున్నారు.