మద్యం కేసులో కీలక నిర్ణయం.. ఏ1 కేసిరెడ్డికి షాక్

ఏపీ మద్యం స్కాంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-10-28 06:35 GMT

ఏపీ మద్యం స్కాంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుడు కేసిరెడ్డి గతంలో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసినందున ఆయన ప్రాసిక్యూషన్ కు సర్కారు అనుమతి తప్పనిసరిగా చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరెడ్డికి మరింత ఉచ్చు బిగిస్తున్నట్లేనని అంటున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టు అయిన కేసిరెడ్డి విజయవాడ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఆయన గతంలో ఐటీ సలహాదారుగా పనిచేయడంతో ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్నారు. దీంతో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించాల్సివుంది. లేదంటే న్యాయపరమైన చిక్కుముడులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కారణంతో సిట్ వినతి మేరకు రాజ్ కేసిరెడ్డి ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది.

మద్యం స్కాంపై దర్యాప్తు మందకొడిగా సాగుతోందని విమర్శల నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. కేసులో ఆధారాలు లభించలేదని, ఇకపై ఎలాంటి చర్యలు ఉండవని నిందితులు భావిస్తున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నిందితులకు షాకిచ్చేలా ప్రభుత్వం పావులు కదిపిందని అంటున్నారు. కేసిరెడ్డి ప్రాసిక్యూషన్ తో మరిన్ని అంశాలు వెలుగులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చర్చ జరుగుతోంది.

మరోవైపు ప్రభుత్వ తాజా నిర్ణయంపై వైసీపీ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మద్యం స్కాంలో వైసీపీ కీలక నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ విమర్శలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు ఈ కేసులో ఇరుక్కోవడంతో ప్రభుత్వ చర్యలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ కేసులో బిగ్ బాస్, అంతిమ లబ్ధిదారు అంటూ ముఖ్యనేత చుట్టూ అనుమానాలు రేకెత్తించిన సిట్ ఇప్పుడు సైలెంటుగా పనిచేసుకుపోతుండటం కూడా అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో లిక్కర్ స్కాం ముగింపు ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News