'భరత మాత'చుట్టూ కొత్త వివాదం.. ఏం జరిగింది?
భారత దేశం.. భరత మాత.. ఈ రెండు పదాలు మనకు కొత్తకాదు. అయితే.. తొలిసారి భారత మాత చుట్టూ కొత్త వివాదం ము సురుకుంది.;
భారత దేశం.. భరత మాత.. ఈ రెండు పదాలు మనకు కొత్తకాదు. అయితే.. తొలిసారి భారత మాత చుట్టూ కొత్త వివాదం ము సురుకుంది. వాస్తవానికి గతంలోనూ `భరత మాత` పేరు వివాదానికి కారణమైన విషయం గుర్తుండే ఉంటుంది. 10 సంవత్సరా ల కిందట.. తొలిసారి `భరత మాత` పేరుపై అనేక విమర్శలు వచ్చాయి. అప్పట్లో కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ.. `భరత మాత` నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. దేశ వాసులందరూ.. భరత మాతను పూజించాలని పిలుపునిచ్చా రు. అదేసమయంలో సినిమా హాళ్లలోనూ జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ వ్యవహారం రాజకీయంగా దుమారానికి దారి తీసి.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ''ఈ దేశం భరత మాత అయితే.. పిత ఎవరు?'' తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని కాంగ్రెస్ నాయకులు కూడా అందిపుచ్చుకుని ఆర్ ఎస్ ఎస్ వాదాన్ని మోడీ ప్రజలపై రుద్దుతున్నారని, ఎవరికి నచ్చినట్టు వారు పిలుచుకోవచ్చని పేర్కొన్నారు. ఇదేసమయంలో పార్ల మెంటులోనూ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. అప్పటి ఎంపీలు.. రాజ్యాంగంలో దేశం పేరును ఏమని పేర్కొన్నారని ప్రశ్నించా రు. `భరత మాత` అని పేర్కొన్నారా? అని నిలదీశారు. కానీ, రాజ్యాంగంలో `ఇండియా`, యూనియన్ గవర్న్‌మెంట్ అనే పేర్కొన్నారని కేంద్రం పేర్కొంది. ఆ తర్వాత.. ఆవివాదం సర్దుమణిగింది. అయితే.. తాజాగా మరోసారి `భరత మాత` చుట్టూ వివాదం రాజుకుంది.
ఏం జరిగింది?
తాజాగా అక్టోబరు 1న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) శత వసంతాల వేడుక నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకుడు మాధవ్ గోల్వాకర్ గురించి సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా 100 రూపాయల విలువైన నాణేన్ని ఆవిష్కరించారు. దీనికి ఒకవైపు జాతీయ చిహ్నం ఉండగా.. మరోవైపు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భరత మాత చిత్రం ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశంలో తొలిసారి భరత మాతను ఇంతలా గౌరవించిన ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. భరత మాతకు.. ఆర్ ఎస్ ఎస్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు భరత మాత చిత్రంతో నాణెం అయితే ముద్రించలేదు.
వివాదం ఇదీ..
మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా.. సమాజ్ వాదీ పార్టీ(యూపీ), బీజేడీ(ఒడిసా) నేతలునిప్పులు చెరిగారు. భరత మాతను ఒక సంస్థకు పరిమితం చేయడం.. అది కూడా మతపరమైన సంస్థకు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు. భరత మాత అనేది ప్రతీక మాత్రమేనని బీజేడీ పేర్కొనగా.. 104 కోట్ల మంది ఆత్మకు ప్రతీకగా కాంగ్రెస్ వర్ణించింది. ఇక, భరత మాతను ఆర్ ఎస్ ఎస్‌కు పరిమితం చేయడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరదీస్తున్నారని ఎస్పీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.