గవర్నర్ చేతికి రిజర్వేషన్ల అంకం.. ఆమోదిస్తారా?
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.;
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అది కూడా.. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నారు. దీని కోసమే ఎన్నికలను సైతం వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు సైతం ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉంది. అది ఎప్పుడు ఆమోదం పొందుతుందన్నది క్లారిటీ లేదు. ఇటీవల సుప్రీంకోర్టు నాలుగు మాసాల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. ఈ కాలపరిమితి(బిల్లుల ఆమోదానికి సంబంధించి)ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిపై ఇంకా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్నయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సదరు రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్సు తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించిన పత్రాలను తాజాగా గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ఇక్కడ అనుమతి పొందితే.. ఆ వెంటనే దీనిపై ఆర్డినెన్సు జారీ చేయడం ద్వారా.. రిజర్వేషన్లను కల్పించాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహం. కానీ.. ఇది సాధ్యమేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్రపతిదే తుది నిర్ణయం. దీనిపై గవర్నర్లకు ప్రత్యేకంగా అధికారాలు కూడా లేవు.
ఆర్డినెన్సు ఇస్తే.. దాదాపు అంగీకరించినట్టే అవుతుంది. సో.. దీనికి గవర్నర్ ఆమోదం దక్కడం ప్రశ్నార్థకమే. గతంలో వైఎస్ ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీకి 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. అప్పట్లోనూ ఇదే సమస్య వచ్చింది. రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. దీనిని గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసే ప్రయత్నం చేశారు.కానీ, ఉమ్మడి హైకోర్టు దీనిని రద్దు చేసింది. ఆ తర్వాత.. సుప్రీంకోర్టు కూడా.. దీనిని రద్దు చేసింది. ఇతర విషయాలు.. అంటే అభివృద్ధి.. వంటి అంశాలపై ఆర్డినెన్సు ను తీసుకువస్తే..ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, కొన్ని సామాజిక వర్గాలను ప్రభావితం చేసే ఇలాంటి రిజర్వేషన్లపై మాత్రం గవర్నర్ ఆమోదం తెలిపి.. ఆర్డినెన్సు ఇస్తారా? అన్నది ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.