ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమాయణం.. మెడికో దీపిక ఆత్మహత్య కేసులో సంచలనం?
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక కేసులో మిస్టరీ వీడింది.;
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక కేసులో మిస్టరీ వీడింది. ఆమెతో ప్రేమాయణం కొనసాగించిన నందగామ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అమర్ సాహస్ మోసం చేయడం వల్లే దీపిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వైద్య విద్యలో దీపిక సీనియర్ అయిన అమర్ సాహస్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైనట్లు చెబుతున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట మార్చడంతో దీపిక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడినట్లు చెబుతున్నారు. మరోవైపు దీపికను ప్రేమిస్తున్నానని చెప్పిన అమర్ సాహస్ బెంగళూరులో వైద్య విద్య అభ్యసిస్తున్న మరో మెడికోతోనూ ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని అంటున్నారు.
మెడికో దీపిక ఆత్మహత్యకు కారణమైన నేరానికి నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అమర్ సాహస్ ను విజయవాడలోని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన దీపిక విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో అనస్థీషియా విభాగంలో పీజీ చివరి సంవత్సరం చదివేది. హైదరాబాద్ కు చెందిన అమర్ సాహస్ ఆమెకు సీనియర్. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ గా అమర్ సాహస్ పనిచేస్తున్నారు. ఏడాది కాలంగా దీపికను ప్రేమిస్తున్నానని అమర్ సాహస్ చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో అమర్ సాహస్ తనతోపాటు చదువుకున్న మరో విద్యార్థినితోనూ ప్రేమ కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె కర్ణాటకలో పీజీ చదువుతోందని వెల్లడైందని అంటున్నారు.
దీపికను ప్రేమిస్తున్నానని చెప్పిన అమర్ సాహస్ కర్ణాటకలో ఉన్న తన క్లాస్ మేట్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని, ఈ విషయం తెలిసి దీపిక నిలదీయడంతో ఇద్దరి మధ్య కొద్ది నెలలుగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దీపిక ఆత్మహత్య చేసుకున్న గత ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి విధుల్లో ఉండగా, అమర్ కు ఫోన్ చేసిందని, ఏఐ చాట్ బాట్ అరట్టైలో ఇద్దరూ చాటింగ్ ద్వారా తీవ్రంగా వాదులాడుకున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఇద్దరి మధ్య చాట్ వార్ నడిచిందని, తనను ప్రేమిస్తున్నానని చెప్పి, వేరొకరితో పెళ్లికి ఎలా సిద్ధమవుతున్నావని దీపిక ప్రశ్నించినట్లు చెబుతున్నారు.
దీపికను పెళ్లి చేసేందుకు అమర్ సాహస్ నిరాకరించడంతో ఆమె తీవ్రంగా మనస్థాపానికి గురైందని చెబుతున్నారు. అమర్ సాహస్ చేతిలో మోసపోయాననే భావనతో తన బ్యాగ్ లో ఉన్న మత్తు ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. దీపిక ఇంజక్షన్ చేసుకున్న తర్వాత నోటి నుంచి నురగలు కక్కుకుని ప్రాణాలు కోల్పోయిందని, పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలో శరీరంలో మత్తు ఇంజక్షన్ నమూనాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీపిక ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో సమాచారాన్ని విశ్లేషించగా, డాక్టర్ అమర్ సాహస్ తో ఆమె ఎక్కువగా ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడైందని అంటున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగుచూసినట్లు చెబుతున్నారు.