దాహం తీర్చే చెట్లు !

‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ గా పేరు పడ్డ బేవోబాబ్‌ చెట్లు ఆఫ్రికాలోని ఉష్ణ మండల ప్రాంతాల ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నాయి.

Update: 2024-04-28 23:30 GMT

ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ దేశం‌లోని మహాఫలి పీఠభూమిలోని మహాఫలి, యాంటండ్రాయ్‌ జాతుల్లోని సుమారు 20 వేల మంది ఆ చెట్టులో దాచుకున్న నీటి వసతి మీదే ఆధారపడి బతుకుతున్నారు. అక్కడి ఆంపటక అనే గ్రామంలో సుమారు 500 మంది జనాభాకు 300 దాహం తీర్చే‌ చెట్లున్నాయి. ఒక్కో కుటుంబం అందులో కొన్ని చెట్లను తీసుకుని వాటిలో నీటిని దాచుకుని వాడుకుంటారు.

‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ గా పేరు పడ్డ బేవోబాబ్‌ చెట్లు ఆఫ్రికాలోని ఉష్ణ మండల ప్రాంతాల ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నాయి. వేసవిలో పండ్లను ఇవ్వడంతో పాటు, ప్రజలకు అవసరమైన నీటి అవసరాలనూ తీరుస్తున్నాయి. వానాకాలంలో ప్రజలు ఈ చెట్ల తొర్రలలో నీటిని పోసి దాచిపెడతారు. ఎండాకాలంలో వాటిని తీసి వాడుకుంటారు.

ఎడారి చెట్టు అయిన బేవోబాబ్ ఆఫ్రికాలోని 32 దేశాల్లో పెరుగుతుంది. వేల సంవత్సరాల పాటు ఇవి బతుకుతాయి. దాదాపు వంద అడుగుల ఎత్తు వరకూ 50 మీటర్ల చుట్టు కొలతతో ఉంటాయి. ఎండాకాలంలో కూడా ఈ చెట్లు దాదాపు 1,20,000 లీటర్ల నీటిని ఇది తన కాండంలోని నిల్వ చేసుకుంటుంది. బాటిల్ ఆకృతిలో దీని కాండం కనిపించడంతో దీనిని బాటిల్ ట్రీ అని కూడా పిలుస్తారు.

ఈ చెట్ల లోపల జంతువులతో పాటు మనుషులూ కూడా తల దాచుకుంటారు. దీని ఆకులు, పండ్లతో పాటు బెరడు వరకూ అన్నీ పనికొస్తుంది. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో వేసవిలో నీటికి కటకటగానే ఉంటుంది. అక్కడి ఆదివాసీలు బేవోబాబ్‌ చెట్ల తొర్రల్లో వానాకాలం నీరు ఎండాకాలంలో కూడా స్వచ్ఛంగా ఉండటం గమనించారు. ఈ తొర్రల్లో నీరు నిల్వ ఉన్నా చెట్టు లోపలి భాగం కుళ్లలేదని గుర్తించారు.

ఆ చెట్టుకు పెద్ద తొర్రలు చేసి, వానాకాలంలో అందులో నీటి నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. నీళ్లు పోయడం పూర్తయ్యాక లోహపు రేకు సాయంతో దానిని మూసేస్తారు. చెట్టు లోపలి భాగం ఈ నీటిని శుద్ధి చేయడం విశేషం. సహజంగా నీళ్లు దొరికే వసతులన్నీ అడుగంటాక, వీటిని తెరిచి వాడుకోవడం అలవాటు చేసుకోవడం గమనార్హం.

Tags:    

Similar News