లుంగీ మడతపెట్టి దేశ మాజీ అధ్యక్షుడు పరార్
తాజాగా 81 ఏళ్ల అబ్దుల్ హమీద్ గత వారం ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌కు బయలుదేరి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి.;
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనమైన తర్వాత, ఆ పార్టీ నాయకులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. షేక్ హసీనా ఇప్పటికే దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల ప్రకారం, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.
అవామీ లీగ్ విద్యార్థి విభాగం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన మహ్మద్ అబ్దుల్ హమీద్, 2013 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారి, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం అవామీ లీగ్ హయాంలో జరిగిన ఘటనలపై దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో మాజీ అధ్యక్షుడు హమీద్‌పై హత్య కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.
తాజాగా 81 ఏళ్ల అబ్దుల్ హమీద్ గత వారం ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌కు బయలుదేరి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. ఆయన తెల్లవారుజామున 3 గంటల సమయంలో విమానాశ్రయానికి చేరుకున్నారని, ఆ సమయంలో లుంగీ ధరించి ఉన్నారని, ఆయనతో పాటు సోదరుడు, బావ కూడా ఉన్నారని తెలుస్తోంది. విమానాశ్రయంలో ఆయనకు సంబంధించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనపై తాత్కాలిక ప్రభుత్వం అప్రమత్తమైంది. మహ్మద్ యూనస్ ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిని బదిలీ చేసినట్లు సమాచారం.
మాజీ అధ్యక్షుడు హమీద్ వైద్య చికిత్స నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లారని ఆయన కుటుంబసభ్యులు చెబుతుండగా, ఎదుర్కొంటున్న కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకే ఆయన దేశం విడిచి పారిపోయారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం సోమవారం అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. పార్టీ, దాని నాయకులపై ప్రత్యేక ట్రైబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.