అరాచకాల బంగ్లా.. హిందూ జర్నలిస్టు.. వ్యాపారిని దారుణంగా చంపేశారు
ఇప్పటికే పలువురు హిందువులను దారుణంగా హతమార్చిన ఉదంతాలకు కొనసాగింపుగా.. తాజాగా ఒక హిందూ జర్నలిస్ట్ ను దారుణంగా హతమార్చిన ఉదంతం చోటు చేసుకుంది.;
భారతదేశంపై అక్కసు.. ఆగ్రహాన్ని నరనరాన నింపేసుకున్న బంగ్లాదేశ్ లో ఆప్పుడు ఆ దేశంలోని మైనార్టీలైన హిందువులపై వరుస పెట్టి ఆరాచక ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు హిందువులను దారుణంగా హతమార్చిన ఉదంతాలకు కొనసాగింపుగా.. తాజాగా ఒక హిందూ జర్నలిస్ట్ ను దారుణంగా హతమార్చిన ఉదంతం చోటు చేసుకుంది.
పిస్టల్ తో కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు.. అక్కడితో ఆగకుండా అతడి గొంతు కోసేసి కసి తీర్చుకున్నారు. బంగ్లాదేశ్ లోని జెస్సోర్ జిల్లాలోని కపాలి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల రానా ప్రతాప్ అనే వ్యక్తికి స్థానికంగా ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. అంతేకాదు.. ఒక న్యూస్ పేపర్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నడుచుకుంటూ రోడ్డు మీద వెళుతున్న అతనిపై గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. అనంతరం తలపై కాల్పులు జరిపారు. దాదాపు ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. అందులో మూడు బుల్లెట్లు బాధితుడి తలలో దిగాయి. అనంతరం గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఉదంతంలో ప్రతాప్ ఘటనాస్థలంలో కన్నుమూశాడు.
గడిచిన కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు మరింత పెరిగాయి. డిసెంబరులో నలుగురు హిందువులు హత్యకు గురయ్యారు. వరుస హత్యలతో బంగ్లాదేశ్ లోని హిందువులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. జర్నలిస్టు ప్రతాప్ హత్య తర్వాత మణి చక్రవర్తి అనే కిరాణా వ్యాపారిని హతమార్చారు. అత్యంత రద్దీగా ఉండే చార్ సిందూర్ బజార్ లో హత్య జరిగింది. షాపులోకి జొరపడిన గుర్తు తెలియని దుండగులు అతడ్ని పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీనికి ముందు మరో మహిళను దారుణంగా హతమార్చారు. గడిచిన పద్దెనిమిది రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురి కావటం గమనార్హం.