ఢాకాలో స్కూల్ పై కూలిన విమానం... మృతుల సంఖ్య 32...విద్యార్థుల నిరసన, కీలక డిమాండ్లివే!
అవును... బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పాఠశాలపై వైమానిక దళానికి చెందిన ఎఫ్-7 బీజీఐ శిక్షణ యుద్ధ విమానం కూలిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.;
బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఢాకాలో పాఠశాల భవనంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. చైనాలో తయారైన ఎఫ్-7 జెట్ విమానం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్ స్టోన్ స్కూల్ భవనంపై కూలిపోయింది. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో... మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులు నిరసనలు మొదలుపెట్టారు.
అవును... బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పాఠశాలపై వైమానిక దళానికి చెందిన ఎఫ్-7 బీజీఐ శిక్షణ యుద్ధ విమానం కూలిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 32కి చేరింది. ఇందులో 29 మంది విద్యార్థులు కాగా.. మిగిలినవారిలో ఒకరు పైలెట్, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ యుద్ధ విమానం రెండు అంతస్తుల భవనంపైకి దూసుకెళ్లిన ఈ ఘటనలో సుమారు 171 మంది గాయపడ్డారని.. వీరిలో ఎక్కువ మంది మైల్ స్టోన్ స్కూల్, కాలేజీ విద్యార్థులు అని అధికారులు వెల్లడించారు. ఆ ఘటనలో గాయపడిన వారిని అత్యవసర సిబ్బంది రక్షించారు. వారిలో ఎక్కువ మందికి కాలిన గాయాలు అయ్యాయని.. వారిలో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బంగ్లాదేశ్ ఉపయోగించే కాలం చెల్లిన శిక్షణ విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢాకాలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఇదే సమయంలో... చనిపోయిన, గాయపడిన వారి సంఖ్యను ఖచ్చితంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే... ఈ నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారని.. లాఠీచార్జ్ చేశారని స్థానిక మీడియా నివేదించింది.
మరోవైపు.. పాఠశాల భవనంపై యుద్ధ విమానం కూలిన ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... బంగ్లాకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు భారత్ నుంచి ప్రత్యేక వైద్య బృందం ఢాకా వెళ్లనుంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.