రూ.1.72 లక్షల బిల్లు.. బార్ మేనేజర్‌తో యువతి చేసిన డీల్ వైరల్!
బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ డిస్కషన్‌కు దారితీస్తోంది.
బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ డిస్కషన్‌కు దారితీస్తోంది. లగ్జరీ బార్‌లో భారీ మొత్తంలో బిల్లు చేసిన ఓ యువతి దాన్ని చెల్లించలేకపోవడంతో ఆమెకు గుండు గీయించినట్లు వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యవహారంలో బిల్లు చెల్లించలేదన్న అంశం కంటే.. ఒక ప్రైవేట్ సంస్థకు ఇలాంటి శిక్ష విధించే హక్కు ఉందా? అన్నదే ఎక్కువ డిస్కషన్ గా నిలుస్తోంది.
ఆగస్టు 25న బ్యాంకాంక్ లోని ఓ బార్‌లోకి 18 ఏళ్ల యువతి నకిలీ గుర్తింపు కార్డుతో ప్రవేశించినట్లు బార్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఆమె పెద్ద మొత్తంలో ఫుడ్, కాస్ట్లీ డ్రింక్స్ తీసుకున్నట్లు సమాచారం. చివరకు బిల్లు సుమారు 60 వేల థాయ్ బాత్‌కు చేరింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.1.72 లక్షలు. బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారని తెలుస్తోంది.
ఇక్కడి నుంచే వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. తన వద్ద డబ్బు లేదని చెప్పిన యువతి.. తన పొడవాటి జుట్టును ఇచ్చేందుకు అంగీకరించినట్లు బార్ యాజమాన్యం పేర్కొంది. జుట్టును వేరు చేసి విక్రయించేందుకు డీల్ కుదిరిందని, దాని విలువ 3,000 బాత్‌గా నిర్ణయించారని చెబుతోంది. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి పూర్తిగా గుండు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే యువతి కుటుంబం మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది. బిల్లును విడతల వారీగా చెల్లించేందుకు యువతి తల్లి రెడీగా ఉన్నప్పటికీ బార్ యాజమాన్యం అంగీకరించలేదని చెబుతోంది. అంతేకాదు, యువతి శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని కుటుంబం ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తల్లి వెల్లడించారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న వ్యక్తి తనకు వేరే మార్గం లేదనే భావనలో ఏదైనా డీల్ కు ఒప్పుకుంటే, దాన్ని స్వచ్ఛంద సమ్మతిగా పరిగణించవచ్చా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు.
బార్‌కు నష్టం జరిగితే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా శిక్ష విధించడం ఎందుకు జరిగిందన్నది ఇప్పుడు విచారణలో కీలకంగా మారింది. మరోవైపు యువతి వయసు, ఆమె మానసిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ చూస్తుంటే ఈ ఘటన చివరకు ఓ బార్ బిల్లు వివాదంగా మిగలకపోవచ్చు. డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి హక్కులు ఏమిటి? వ్యాపార సంస్థకు ఎంతవరకు చర్య తీసుకునే అధికారం ఉంది? అంగీకారం పేరుతో తీసుకున్న డెసిషన్ నిజంగా స్వచ్ఛందమేనా? వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కేసుగా ఇది మారే అవకాశం లేకపోలేదు.