బాబు బనకచర్ల కల నెరవేరుతుందా ?
బనకచర్ల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడం తోనే ఒక భారీ ప్రాజెక్టుని ఎత్తుకున్నారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ అని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు.;
బనకచర్ల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడం తోనే ఒక భారీ ప్రాజెక్టుని ఎత్తుకున్నారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ అని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీ నుంచి టీడీపీ ఎంపీల మద్దతు అవసరం కావడంతో తన పలుకుబడిని ఉపయోగించుకుని చంద్రబాబు చకచకా ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులను తెర మీదకు తెస్తున్నారు.
బనకచర్ల ప్రాజెక్టు ఏకంగా 81 వేల కోట్ల రూపాయలతో రూపొందించినది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమ కరవు పూర్తిగా పోతుంది. అంతే కాకుండా ఏపీ అంతటా గోదావరి నీరు పారుతుంది. దాంతో సాగు తాగు నీటి కష్టాలు తీరడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు పూర్తిగా తీరుతాయి.
ఏటా గోదావరి నీరు మూడు వేల టీఎంసీల దాకా సముద్రంలో కలసిపోతోంది. వరద జలాల నుంచి కేవలం రెండు వందల టీఎంసీలు తీసుకుంటే చాలు బనకచర్ల పూర్తి అవుతుంది. అంతే కాదు ఏపీ జాతకమే మారిపోతుంది. ఇక గట్టిగా చెప్పాలీ అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణాకు ఏ విధంగానూ నష్టం లేదు. దిగువన ఉన్న రాష్ట్రంగా ఏపీకి వరద జలాలను ఉపయోగించుకునే నైతిక హక్కు ఉందని అంటున్నారు.
ఏటా భారీ వరదలు గోదావరి పరీవాహిక ప్రాంతంలో సంభవించినపుడు ఏపీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు లంక ప్రాంతాల ప్రజలను తీసుకెళ్ళి మరీ వారిని రక్షిస్తోంది. అలా ఏటా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వరద కష్టాలు భరిస్తున్న ఏపీకి వరద నీరు వాడుకునే హక్కు లేదనడం తర్కానికి అందకుండా ఉంది.
మరో వైపు చూస్తే గోదావరి జిలాలు రెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నాయి. నీటి హక్కులు చూస్తే తెలంగాణాకు వేయి టీఎంసీలు ఏపీకి అయిదు వందల టీఎంసీలు దాకా నికర జలాల మీద ఉన్నాయి. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాలు కలసి గోదావరి మీద ప్రాజెక్టులు కట్టలేకపోయాయి. ఏపీకి పోలవరమే దిక్కుగా ఉంటే తెలంగాణా కాళేశ్వరం కట్టింది. ఇలా గోదావరి జిలాలు ఎంత వాడుకున్నా గట్టిగా రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీల నికర జలాల నుంచే తప్ప మిగిలినవి అన్నీ సముద్రం పాలు అవుతున్నాయి ఈ నేపథ్యంలో మిగులు జలలా సంగతి దేవుడెరుగు అన్నట్లుగా సీన్ ఉంది. వరద జలాల గురించి వాదులాట అవసరమా అన్న చర్చ కూడా ఉంది.
అయితే నీటి కంటే నిప్పు మరోటి లేదు, రాజేసి రాజకీయం చేయడానికి అంతకంటే మరో సాధనం లేదు అన్నట్లుగా దేశంలో ఎక్కడ చూసినా ఉంది. ఇక కేంద్రం అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి నీటి వివాదాలు పరిష్కరించాలని చూస్తోంది. అయితే బనకచర్ల అన్న విషయం పక్కన పెడితే మిగిలిన వాటి మీద చర్చిస్తామని తెలంగాణా ప్రభుత్వం అంటోంది.
మరి అటు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ కూర్చుని గోదావరి క్రిష్ణా సహా నదీ జలాల వివాదాలు పరిష్కరించుకుంటారా బనకచర్ల విషయంలో కలలు కంటున్న చంద్రబాబు ఆశలు నెరవేరుతాయా అన్నది చూడాల్సి ఉంది.