అయోధ్య రామాలయంలో మరో అద్భుత ఘట్టం

శతాబ్దాల పోరాటం ఆస్తిక జనుల ఆరాటం ఫలించి ఇప్పటికి సరిగా అయిదేళ్ల క్రితం అయోధ్యలో శ్రీరాముని జన్మభూమిలో అద్భుత ఆలయానికి భూమి పూజ జరిగింది.;

Update: 2025-11-07 16:11 GMT

శతాబ్దాల పోరాటం ఆస్తిక జనుల ఆరాటం ఫలించి ఇప్పటికి సరిగా అయిదేళ్ల క్రితం అయోధ్యలో శ్రీరాముని జన్మభూమిలో అద్భుత ఆలయానికి భూమి పూజ జరిగింది. ఆ తరువాత 2024 జనవరి మొదటి అంతస్తు పూర్తి చేసుకుని ప్రారంభించబడింది. ఇక ఇపుడు మరో కీలక ఘట్టంలోకి అడుగుపెట్టబోతోంది. నవంబర్ 25న అయోధ్యలో జరిగే ధ్వజస్తంభ ప్రతిష్టతో భవ్యమైన రామ మందిర నిర్మాణం పరిపూర్తి కాబోతోంది. ఇది దేశంలోని మొత్తం రామభక్తులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆస్తిక జనులకు సంతోషకరమైన వార్తగానే భావించాలి.

నాటి నుంచి నేటి దాకా :

ఇక ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే కనుక ఇప్పటికి అయిదు వందల ఏళ్ళ క్రితం అయోధ్యలో రామాలయం కూల్చివేత జరిగింది. ఆ తరువాత అంతా వలస పాలకుల ఏలుబడిలో భారతదేశం బంధీ అయింది. ఈ పోరాటం అంతా సాగి స్వాతంత్ర్యం సాధించుకునే సరికి 1947 వచ్చింది. ఇక నాటి నుంచి రామ మందిరం నిర్మాణం జరగాలని అయోధ్యలో ఆయన పుట్టిన చోటనే అది జరగాలని అతి పెద్ద ఉద్యమమే సాగింది. అలా కొన్ని దశాబ్దాల కాలం ఇట్టే సాగిపోయింది. ఎట్టకేలకు న్యాయపరమైన పరిష్కారం అందరికీ ఆమోదకరమైన తీరులో రావడంతో రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.

అద్భుతమైన నిర్మాణం :

అయోధ్యలో రామ మందిరం అద్భుతంగా రూపొందిస్తున్నారు. మొత్తం డెబ్బై ఎకరాలలో సాగుతున్న ఈ నిర్మాణంలో మొదటి అంతస్తులో రాముని దర్బార్ ఉంటుంది. అలాగే రెండవ అంతస్తులో ఆధ్యాత్మిక సంపదగా ఎన్నో అపురూపమైన గ్రంధాలను ఉంచబోతున్నారు. ఈ మొత్తం సువిశాలమైన ప్రదేశంలో ఏకంగా ఏడు ఆలయాలు కలసి ఉండబోతున్నాయి. అయోధ్య రామాలయం లోకి అడుగు పెట్టిన వెంటనే ఒక మధురమైన భావన కలిగే విధంగా మొత్తం రూపకల్పన చేశారు.

మోడీ రికార్డు :

ఈ మొత్తం నిర్మాణం విషయం ఒక ఎత్తు అయితే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అరుదైన రికార్డుని నెలకొల్పారు అని చెప్పాల్సి ఉంది. ఆయనే 2020 ఆగస్టు ప్రాంతంలో అయోధ్య రామాలయానికి భూమి పూజ చేశారు, అలాగే ప్రాణ ప్రతిష్ట కూడా చేశారు. కరోనా కీలక దశలో ఇదంతా జరిగింది. మోడీ ఆ సమయంలో నిర్వహించిన ఒక మహా ఆధ్యాత్మిక యాగంగా అంతా చెప్పుకున్నారు. ఇక 2024 జనవరిలో మొదటి అంతస్తు ప్రారంభం అయింది. రాముని ఆలయానికి ఆ విధంగా శ్రీకారం చుట్టింది కూడా నరేంద్ర మోడీయే. ఇపుడు నవంబర్ 25న జరిగే ద్వజ స్తంభం ప్రతిష్ట కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతోంది. మొత్తానికి చూస్తే నరేంద్ర మోడీ ప్రతీ కీలక ఘట్టంలోనూ ఉన్నారు ఆ విధంగా వందల ఏళ్ళ ఈ ఆలయ చరిత్రలో ఆస్తిక జనుల ఆకాంక్షలలో ఆ మీదట చరిత్రలో కూడా ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News