రికార్డుల రామయ్య @ అయోధ్య : 15 కోట్ల మంది దర్శనం, రూ.500 కోట్ల విరాళాలు
భక్తుల రాకతో పాటు అయోధ్య బాలరాముడికి కానుకలు, విరాళాల రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు ఆలయానికి మొత్తం రూ.500 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్ ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముడి దర్శన భాగ్యం కోసం దేశవిదేశాల నుంచి భారీగా తరలివస్తున్నారు. అనేక వివాదాల తర్వాత 2024 జనవరి 22న ఘనంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవంతో అయోధ్య రాముడిని భారీ ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏకంగా 15 కోట్లకు పైగా భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా వెల్లడించింది.
రూ.500 కోట్ల విరాళాలు
భక్తుల రాకతో పాటు అయోధ్య బాలరాముడికి కానుకలు, విరాళాల రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు ఆలయానికి మొత్తం రూ.500 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్ ప్రకటించింది. భక్తులు తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ భారీగా సమర్పించిన ఈ కానుకల వివరాలను ట్రస్ట్ విభజించి వెల్లడించింది. ఆన్‌లైన్ లోనూ ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.350 కోట్లు, ఆలయ హుండీల ద్వారా మరో రూ.150 కోట్లు సమకూరినట్లు ట్రస్టు వివరించింది.
పారదర్శకతే పరమావధి
ఇంత భారీ మొత్తంలో వస్తున్న విరాళాల లెక్కింపు, అలాగే ఆలయ నిర్వహణ, అభివృద్ధి పనుల ఖర్చుల విషయంలో అత్యంత కచ్చితత్వాన్ని, పారదర్శకతను పాటిస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. ప్రతి పైసాకూ పక్కాగా లెక్కలు నిర్వహిస్తూ, అత్యాధునిక అకౌంటింగ్ వ్యవస్థను వాడుతున్నట్లు పేర్కొంది. భక్తుల సౌకర్యార్థం అయోధ్యలో వసతులు, ఉచిత వైద్య సేవలు, నిరంతర అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను ఈ నిధులతో మరింత విస్తృతం చేస్తున్నారు. రామజన్మభూమిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మరిన్ని మౌలిక వసతులను ట్రస్ట్ సమాంతరంగా అభివృద్ధి చేస్తోందని చెబుతున్నారు.
ఇక సాధారణ భక్తులతోపాటు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడాకారులు కోట్లాది రూపాయలను ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. సూరత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి బాలరాముడి కోసం కోట్ల విలువైన కిరీటాన్ని బహూకరించడం జాతీయ స్థాయిలో అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. మరో వైపు అయోధ్యకు భక్తుల రాక వల్ల కేవలం ఆలయానికే కాకుండా స్థానికుల ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయని విశ్లేషిస్తున్నారు. హోటళ్లు, రవాణా, పూజా సాగ్రి, హస్తకళల వ్యాపారాలు మునుపెన్నడూ లేని విధంగా పుంజుకున్నాయని చెబుతున్నారు.