మూడ్ ఆఫ్ ఏపీ : కూటమి జాగ్రత్త పడాల్సిందే !
ఏడాదికి అయిదు లక్షలు మొత్తం 20 లక్షల హామీని వారు నమ్మడం లేదు అని అంటున్నారు. నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు అన్నది ఇవ్వలేరని చెబుతున్నారు.;
ఆత్మ సాక్షి సర్వే పేరుతో ఒక అధ్యయనం ఇపుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మూడ్ ఆఫ్ ఏపీ గా ఈ సర్వే చేశారు. నిజం చెప్పాలీ అంటే ఇపుడు ఎన్నికలు అయితే లేవు. ఇక స్థానిక ఎన్నికలు వచ్చే ఏడాది ఉన్నాయి. కానీ ఇంతలోనే ఏపీ జనం కూటమి ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు. ఏడాదిన్నర పాలన మీద జనం అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని మీద ఈ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ పది వరకూ అంటే దాదాపుగా డెబ్బై రోజుల పాటు చేసిన ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత మెల్లగా మొదలైంది అన్నది అర్ధం అవుతోంది. ఇక వివిధ వర్గాల ప్రజానీకం అయితే కూటమి పాలన మీద పెట్టుకున్న ఆశలు తీరే చాన్స్ లేదని అపుడే నిర్ధారణకు రావడం డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లే అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కూటమిలోని ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం మాత్రం రెడ్ జోన్ లో ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది. ఇక ఆరెంజ్ జోన్ లో ఉన్న వారు అయితే ఫర్వాలేదు అన్నట్లుగా ఉండగా గ్రీన్ జోన్ లో ఉన్న వారు చూస్తే తక్కువ మందే కనిపిస్తున్నారు. అంటే ఎమ్మెల్యేల పనితీరులో కూటమిలోని మూడు పార్టీలు జాగ్రత్తపడాలని కూడా ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.
రెడ్ జోన్ లో మెజారిటీ :
కూటమి పార్టీలకు 2024 ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీని అందించారు. అయితే కేవలం ఏడాదిన్నర కాలంలోనే చాలా మంది మీద వ్యతిరేకత వచ్చినట్లుగా తెలుస్తోంది. రెడ్ జోన్ లో ఉన్న వారి లిస్ట్ చూస్తే టీడీపీ నుంచి 73 మంది, జనసేన నుంచి 12 మంది, బీజేపీ నుంచి ఏడు మంది ఉన్నారు. అంటే టోటల్ గా 92 మంది అన్న మాట. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లు ఉంటే నుంచి టీడీపీ 4, జనసేన బీజేపీ ఒకటిగా రెడ్ జోన్ లో ఉన్నారు. విజయనగరంలో 9 సీట్లు ఉంటే టీడీపీ 5, జనసేన 1గా ఉంది. విశాఖ జిల్లాలో చూస్తే మొత్తం 15 సీట్లకు గానూ టీడీపీ 3, జనసేన రెండు రెడ్ జోన్ లో ఉన్నాయి. తూర్పుగోదావరిలో 19 సీట్లు ఉంటే టీడీపీ 7, జనసేన 2, బీజేపీ 1 రెడ్ జోన్ లో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే 15 సీట్లకు గానూ టీడీపీ 3, జనసేన 4 ఉన్నాయి.
అక్కడ కూడా అలాగే :
ఇక కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉంటే టీడీపీకి చెందిన 6 గురు, బీజేపీకి చెందిన ఒకరు రెడ్ జోన్ లో ఉన్నారు. గుంటూరు 17 సీట్లు ఉంటే టీడీపీ 9, జనసేన 1 ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 5గురు టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారు నెల్లూరులో 10 సీట్లు ఉంటే 5గురు టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. కడపలో 10 సీట్లు ఉంటే టీడీపీ 4, జనసేన ఒకరు రెడ్ జోన్ లో ఉన్నారు. కర్నూల్ లో 14 సీట్లు ఉంటే 7గురు టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యే రెడ్ జోన్ లో ఉన్నారు. అనంతపురంలో చూస్తే 14 సీట్లు ఉంటే 7గురు టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యే రెడ్ జోన్ లో ఉన్నారు. చిత్తూరులో 14 సీట్లు ఉంటే 7 మంది టీడీపీ ఒక బీజేపీ ఎమ్మెల్యే రెడ్ జోన్ లో ఉన్నారు.
ఫరవాలేదు అన్న ఎమ్మెల్యేలు :
ఆరెంజి జోన్ లో ఫరవాలేదు అన్న ఎమ్మెల్యేలను ఉంచారు. వీరి సంఖ్య చూస్తే టీడీపీలో 36 మంది ఉంటే జనసేన నుంచి 5 మంది ఉన్నారు. బీజేపీలో అయితే ఎవరూ లేరు. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి టీడీపీలో 3, విజయనగరం నుంచి జీరో, విశాఖపట్నం నుంచి 3, తూర్పుగోదావరి నుంచి టీడీపీ 5, జనసేన 1, పశ్చిమ గోదావరి నుంచి టీడీపీ 2, జనేఅన 2, క్రిష్ణా టీడీపీ 6, గుంటూరు టీడీపీ 3, ప్రకాశం టీడీపీ 1, నెల్లూరు టీడీపీ 4, కడపలో జీరో, కర్నూల్ లో టీడీపీ 4, అనంతపురం టీడీపీ 2, చిత్తూరు టీడీపీ 3 ఉన్నారు.
గ్రీన్ జోన్ లో వీరే :
ఇక పనితీరు బెస్ట్ అన్న వారిని గ్రీన్ జోన్ లో ఉంచారు. అలా చూస్తే కనుక కూటమిలో మొత్తం టీడీపీలో 27 మంది, జనసేనలో జనసేనలో 2, బీజేపీలో 2 వైసీపీ నుని 11 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చూస్తే టీడీపీలో 1, విజయనగరం నుంచి 3, విశాఖ నుంచి టీడీపీ 1, తూర్పుగోదావరి టీడీపీ 2, జనసేన 1, పశ్చిమ గోదావరి టీడీపీ 4, క్రిష్ణా టీడీపీ 1, జనసేన 1, బీజేపీ 1, గుంటూరు టీడీపీ నుంచి 5, ప్రకాశం టీడీపీ నుంచి 4, నెల్లూరు టీడీపీ నుంచి 1, కడప టీడీపీ నుంచి 1, కర్నూల్ జీరో, అనంతపురం టీడీపీ 2, చిత్తూరు 2 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మంత్రులలో చూస్తే :
ఇక ఏపీ కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. అందులో చూస్తే కనుక రెడ్ జోన్ లో ఏకంగా 14 మంది ఉంటే ఆరెంజ్ జోన్ లో 5 మంది గ్రీన్ జోన్ లో 6 మంది ఉన్నారు. దీనిని బట్టి చూస్తే మంత్రులలో పని మంత్రులు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ఈ సర్వే చెబుతోంది అన్న మాట.
ఎంపీలలో ఇదే తీరు :
ఏపీలో ఉన్న మొత్తం 25 మంది ఎంపీలలో కూటమి నుంచి 21 మంది గెలిచారు. ఇందులో 13 మంది ఎంపీలు రెడ్ జోన్ లో ఉంటే , ఆరెంజ్ జోన్ లో ముగ్గురు, గ్రీన్ జోన్ లో 5 ఉన్నారు అని లెక్క తేలుతోంది. అంటే ఎంపీలు కూడా మెజారిటీ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సర్వే చెబుతోంది అన్న మాట.
ఈ వర్గాలు చెప్పింది ఇదే :
ఇక ఆత్మ సాక్షి సర్వే చూస్తే కనుక మహిళలు, పురుషులను చెరి యాభై శాతం తీసుకుని ఈ సర్వే చశారు. ఇందులో నిరు నిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను, అలాగే రిటైర్డు ఉద్యోగులను, చిన్న వ్యాపారస్తులను, కాలేజ్, యూనివర్శిటీ విద్యార్ధులను, పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులను, అలాగే వివిధ వయసులలో ఉన్న వారిని అందరినీ కలిపి ఒక సమగ్రమైన సర్వేను చేసినట్లుగా చెబుతున్నారు. వీరంతా కూటమి ప్రభుత్వం మీద తమ అభిప్రయాన్ని వ్యక్తం చేశారు.
ఈ అంశాలన్నీ మీద :
ఏపీలో అమరావతి రాజధాని అలాగే జీవనాడిగా ఉన్న పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మద్యం, ఇసుక పాలసీల మీద మైనింగ్ విధానం మీద ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరు మీద, ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రుల పనితీరు మీద ప్రభుత్వం ఓవరాల్ గా పనిచేస్తున్న విధానం మీద వీరిని ప్రశ్నించినపుడు మెజారిటీ సెక్షన్లు పెదవి విరిచినట్లుగా ఈ సర్వే అయితే స్పష్టం చేస్తోంది అని అంటున్నారు.
గ్రౌండ్ రియాలిటీ ఇదీ :
ఇక ఏపీలో మొత్తం నియోజకవర్గాలు చూస్తే కనుక టీడీపీకి జనసేనకు బీజేపీకి మధ్య కార్యకర్తలు నాయకుల మధ్య దిగువ స్థాయిలో కో ఆర్డినేషన్ అయితే లేదు అన్నది సర్వే చెబుతున్న విషయంగా ఉంది. టీడీపీ కూటమితో కలసి పదిహేనేళ్ళ ప్రయాణం అని జనసేన చెప్పడం మీద ఆ పార్టీలో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇది కాపు సామాజిక వర్గంలో నిరాశను పెంచుతోంది అని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేల పనితీరు చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలలో మరీ నిరాశాజనకంగా ఉందని అంటున్నారు.
రైతాంగం ఆవేదన :
కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని అంటోంది. వరి పొగాకు, మిర్చీ, కొబ్బరి, వేరు శనగ, టమోటా అరటి రైతులు అంతా నిరాశలో ఉన్నారు అని అంటున్నారు. సబ్సిడీ ఇవ్వకపోవడం, ఎరువులు పురుగుల మందు వంటి వాటి విషయంలో సకాలంలో ఇవ్వకపోవడం మీద కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బీమా పధకం లేదని చెబుతున్నారు.
నిరుద్యోగ యువత సైతం :
ఏడాదికి అయిదు లక్షలు మొత్తం 20 లక్షల హామీని వారు నమ్మడం లేదు అని అంటున్నారు. నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు అన్నది ఇవ్వలేరని చెబుతున్నారు. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమకు రావాల్సిన డీఎ బకాయిలు, మెడికల్ రీ ఇంబర్స్ మెంట్ లేదని, పే కమిషన్ ఊసే కూటమి ప్రభుత్వం ఎత్తడం లేదని ఆగ్రహంగా ఉన్నారని సర్వే తేల్చింది. బదిలీలలో రాజకీయ జోక్యం పెరిగిందని వారు అంటున్నారు. సామాజిక పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నా చాలా మంది అర్హులకు అయితే ఇంకా దక్కలేదని ఆవేదన లబ్దిదారులలో ఉంది అని అంటున్నారు.
ఇసుక మద్యం మీద వ్యతిరేకత :
ఉచిత ఇసుక అన్నా అది అమలు కావడం లేదని అంటున్నారు. మద్యం విషయం తీసుకుంటే బెల్ట్ షాపులను ఎక్కడికక్కడ పెట్టి విచ్చలవిడిగా పారిస్తున్నారు అని సగటు ప్రజానీకం ఆందోళన చెందుతోంది. బెల్ట్ షాపుల వల్ల రాజకీయ అవినీతి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అన్న భావన కూడా ఉంది. పేదలకు గృహ నిర్మాణం సరిగ్గా లేదని కూడా జనాల నుంచి వచ్చిన అభిప్రాయంగా ఉంది. 19 ఏళ్ళ నుంచి 59 వయసు మధ్యలో మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని మోసం చేశారు అన్న భావన ఉంది.
అమరావతి మీద సైతం :
ఇక చూస్తే అమరావతి 2029 నాటికి కూడా పూర్తి కాదని ఎక్కువ మంది అభిప్రాయపడడం ఒక విషయం అయితే దానికి ఎక్కువగా అప్పులు చేసి ఖర్చు చేస్తున్నారు అన్న భావన కూడా వ్యక్తం అయింది పోలవరం సైతం సకాలంలో పూర్తి కాదనే చాలా మంది అంటున్నారు. నిర్వాసితులకు న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మెడికల కాలేజీలను కూడా ప్రభుత్వమే నడపాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ పధకం అమలు కావడం లేదని 108 వాహనాలు కూడా కనిపించడం లేదని కూడా జనాల ఫిర్యాదుగా ఉంది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయని ఈ సర్వే చెబుతోంది.