అచ్చెన్న... కోరి చెడగొట్టుకుంటున్నారా ?
అలాంటపుడు అచ్చెన్నాయుడు ఎంత బాధ్యతగా ఉండాలన్నదే పార్టీలో చర్చగా ఉంది.;
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కింజరాపు కుటుంబాన్ని ఎంతగానో గౌరవిస్తుంది. దానికి కారణం దివంగత నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు. ఆయన చంద్రబాబు సమకాలీనుడు. బాబుతో అత్యంత స్నెహాం నెరిపిన వారు. కష్టంలో అండగా ఉన్న వారు. ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. ఇక ఆయన ఎంపీగా ఢిల్లీకి వెళ్ళినపుడే తమ్ముడు అచ్చెన్నాయుడుని అసెంబ్లీకి వచ్చేలా చూసుకున్నారు. దానికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారు. అలా 1996లో మొదలైన అచ్చెన్న రాజకీయ జీవితం మూడు దశాబ్దాలు దాటుతోంది.
ఆయనకు చంద్రబాబు ఎంతగానో ప్రోత్సాహం ఇస్తూ వస్తున్నారు 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే అయిదేళ్ళ పాటు మంత్రిగా చేశారు. 2019 తరువాత పార్టీ ఓడితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చేసి హోదాను కల్పించారు 2024లో పార్టీ మళ్ళీ పవర్ లోకి రాగానే కీలకమైన వ్యవసాయ శాఖ ఇచ్చి ఆయన హోదా ఏమిటో చెప్పారు. ఇక అచ్చెన్న కుటుంబం నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన అన్న అల్లుడు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నరు. ఇలా ఒకే కుటుంబంలో మూడు పదవులు ఇవ్వడమే కాదు కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా చేశారు.
అలాంటపుడు అచ్చెన్నాయుడు ఎంత బాధ్యతగా ఉండాలన్నదే పార్టీలో చర్చగా ఉంది. తాజాగా ఆయన విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆడబిడ్డలకు నెలకు 1500 పధకం ఇవ్వాలీ అంటే ఏపీని అమ్మేసుకోవాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పధకం అంత ఖర్చు అవుతుందని అమలు చేయలేమని అన్నట్లుగా సంకేతాలు ఇచ్చేశారు.
ఇది వైసీపీకి అంది వచ్చిన అస్త్రంగా మారింది అని అంటున్నారు. నిజానికి కూటమి పెద్దలు ఎవరూ ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం లేదు. సూపర్ సిక్స్ పధకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. తాము చేసిన పనుల గురించి జనాలకు చెప్పమని పంపిస్తే చేయని వాటి గురించి మాట్లాడడం అందులోనూ వ్యతిరేకత వచ్చేలా వ్యాఖ్యలు చేయడమేంటి అని టీడీపీ అధినాయకత్వం మండిపడుతోందిట.
అచ్చెన్న చేసిన వ్యాఖ్యలతో వైసీపీ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ అయి ఆడబిడ్డలకు మోసం చేశారు అని వెల్లువలా పోస్టింగులు పెడుతోంది. దీంతో కూటమికి ఇది తలనొప్పిగా మారింది. దాంతో అచ్చెన్న తీరు మీద అయితే పెద్దలు మంటగా ఉన్నారు అని ప్రచారం సాగుతోంది. బాధ్యత గలిగిన వారు సహనంతో ఉండాలని అనవసరమైన వ్యాఖ్యలు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక వ్యవసాయ మంత్రిగా అచ్చెన్న పనితీరు పట్ల కూడా అసంతృప్తి ఉందని అంటున్నారు. జగన్ వరస బెట్టి రైతులనే పరామర్శిస్తూ వస్తున్నారు. జగన్ విమర్శలకు సరైన కౌంటర్లు కూడా ఇవ్వలేకపోతున్నారు అని అచ్చెన్న మీద ఇప్పటికే అసంతృప్తి ఉందిట. దానికి తోడు అన్నట్లుగా ఆయన తన వ్యాఖ్యలతో ఇబ్బందులు కోరి తెచ్చుకున్నారు అని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఎంతో మంది ఆశావహులు ఉండగా ఒకే కుటుంబానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చారు అన్నది తమ్ముళ్ల అసంతృప్తిగా ఉంది. దీంతో ఇపుడు అచ్చెన్న విషయంలో ఏమైనా ఆలోచిస్తే కనుక కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇచ్చి ఆయనను పార్టీ పదవిలో నియమించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానిని నోరా పదవికి చేటే అని అచ్చెన్న తొందరలోనే నిరూపించబోతున్నారా అంటే వెయిట్ అండ్ సీ.