అశోక్ గజపతి భూమిలో ‘వైసీపీ ఆఫీసు’.. అధికారులకు గోవా గవర్నర్ ఫిర్యాదు!
తాజాగా, తనకు జరిగిన అన్యాయంపై అశోక్ గజపతిరాజు జిల్లా అధికారులకు లేఖ రాయగా, వారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు.
విజయనగరం పట్టణంలో నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయం స్థల వివాదంలో చిక్కుకుంది. తన స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించారని, గత ప్రభుత్వంలో అక్రమంగా భూమి రికార్డులు మార్చేశారని ఆరోపిస్తూ గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఈ విషయమై అశోక్ గజపతిరాజు ఫిర్యాదు చేసినా, అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. తాజాగా, తనకు జరిగిన అన్యాయంపై అశోక్ గజపతిరాజు జిల్లా అధికారులకు లేఖ రాయగా, వారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు.
విజయనగరంలో తన స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మించారని గోవా గవర్నర్ చేస్తున్న ఆరోపణలు పెను సంచలనంగా సృష్టిస్తున్నాయి. సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న భూమిలో అధికార బలాన్ని ఉపయోగించి ప్రభుత్వ స్థలంగా మార్చేశారని ఆరోపిస్తున్నారు. స్థలం పూసపాటి ఎస్టేట్‌కు చెందిన ప్రైవేటు ఆస్తిగా అశోక్ గజపతిరాజు చెబుతున్నారు. సర్వే నంబర్ 569లో ఉన్న సుమారు ఎకరం స్థలం దశాబ్దాలుగా పూసపాటి వంశీయులైన పీవీజీ రాజు వారసుల ఆధీనంలో ఉందని ఆయన అధికారులకు తెలియజేశారని చెబుతున్నారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి, ఈ భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులు మార్చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం తమకు నోటీసులు ఇవ్వాల్సివున్నా, పట్టించుకోలేదని, ప్రభుత్వ భూమిగా రికార్డులుమార్చి వైసీపీ కార్యాలయానికి 33 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో లీజు ఇచ్చేశారని అశోక్ గజపతిరాజు మండిపడుతున్నారు.
నిబంధనల ఉల్లంఘన
పూసపాటి ఎస్టేట్ వారసుడిగా భూ కేటాయింపులపై అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్వే అండ్ బౌండరీ యాక్ట్-1923లోని సెక్షన్ 9(2), 10(2) నిబంధనలను అధికారులు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపిస్తున్నారు. చట్టప్రకారం ప్రైవేటు ఆస్తిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలంటే యజమానులకు ముందస్తు నోటీసులు ఇచ్చి, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వాదిస్తున్నారు. కానీ, ఇవేవీ జరగకుండానే 2022 జూన్ 23న అప్పటి తహసీల్దార్ ఈ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆయన అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి రికార్డులు అక్రమంగా మార్చేశారంటూ అశోక్ గజపతిరాజు చేస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ప్రభుత్వం నోటీసులు.. వైసీపీ మౌనం
ప్రభుత్వం మారిన తర్వాత అశోక్ గజపతిరాజు ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారంపై దృష్టి సారించిందని చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తికి చెందిన స్థలంలో అధికార పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తూ, జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని సమాచారం. అయితే, ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు వైసీపీ నుండి ఎటువంటి స్పష్టమైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి పీవీజీ రాజు వారసులు చేస్తున్న న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని అంటున్నారు.