జైహింద్ అంటూ ఆపరేషన్ సింధూర్ పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ, "పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపిన దాడులను నేను స్వాగతిస్తున్నాను.;
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో భారత పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'ను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. ఈ మెరుపుదాడిని ఆయన అభినందించారు.
పహల్గాం దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మరణించిన నేపథ్యంలో, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఒవైసీ ఉద్ఘాటించారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని ఆయన అన్నారు.
ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ, "పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపిన దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరోసారి పహల్గాం తరహా ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్తాన్‌కు గట్టి గుణ పాఠం చెప్పాలి. పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్!" అని ట్వీట్ చేశారు.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు తీసుకున్న చర్యలకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఉగ్రవాదులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. 'ఆపరేషన్ సింధూర్'కు జై హింద్ అంటూ తన మద్దతును తెలిపారు.
కాగా, భారత పర్యాటకులపై పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగానే భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్'ను నిర్వహించి, పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 50కి పైగా ఉగ్రవాదులు మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. భారతదేశం యొక్క ఈ చర్యకు పలు దేశాలు మద్దతు తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ దాడికి పాల్పడిన వారికి గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ జరిగింది.