ఏపీ మీడియా ఏకాకి అవుతోందా..!
రాష్ట్రంలో మీడియా పరిస్థితి దారుణంగా మారింది. ఇది ఎవరో వ్యక్తిగతంగా చెబుతున్న విషయం కాదు;
రాష్ట్రంలో మీడియా పరిస్థితి దారుణంగా మారింది. ఇది ఎవరో వ్యక్తిగతంగా చెబుతున్న విషయం కాదు. జాతీయస్థాయి మీడియాలో జరుగుతున్న చర్చ. అంతేకాదు మేధావులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మీడియా ఒక కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ దాని నుంచి తప్పుకుని వ్యక్తిగత అజెండాలతో ముందుకు సాగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి.
ఒక కాకికి ఏదైనా హాని జరిగితే పది కాకులు పోగై `కావు కావు` మంటూ రొద పెడతాయి. కానీ, మీడియా విషయానికి వచ్చేసరికి ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఒక మీడియాపై దాడి జరిగితే రెండో మీడియా కనీసం స్పందించే పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపించడం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 ప్రకారం వచ్చిన వాక్ స్వాతంత్రం వంటివి పత్రికా రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వీటిపై జరుగుతున్న దాడులు భావ ప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న విధ్వంశాలను మీడియానే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది.
కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన దక్కన్ క్రానికల్ పై దాడి ఈ కోణంలోనే చూడాల్సి వస్తుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఏ పత్రికైనా ఏ మీడియా ఆయనా తనకు అందిన సమాచారం ప్రకారం ప్రచురించడం, ప్రసారం చేయడం కామన్ గా జరిగే ప్రక్రియ. ఇది కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. మరి కొందరి మనో భావాలను కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. అయినప్పటికీ మీడియాపై దాడులు చేయటం మీడియా బోర్డులను తగలబెట్టడం మీడియా ప్రతినిధుల పై దాడులు చేయటం అనే సంస్కృతి రాను రాను ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోతోంది.
తాజాగా చంద్రబాబు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అమ్మేసేందుకు అంగీకరించారని, ప్రైవేటీకరిం చేందుకు అంగీకరించారని, తమకు అందిన సమాచారం ప్రకారం దక్కన్ క్రానికల్ పత్రిక వార్త రాసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఏ పత్రికైనా తనకు ఉన్న సమాచారం ప్రకారమే వార్తలు అందిస్తుంది. ఇది తప్పు అయితే సంబంధిత వ్యక్తులు ఖండించొచ్చు. లేదా న్యాయ పరంగా పరువు నష్టం దావా వేయొచ్చు. వివరణలు కోరచ్చు. ఇట్లా రకరకాల మాధ్యమాల్లో చర్యలు తీసుకోవచ్చు.
వార్తలను లేదా ప్రచారాలను ఖండించే అవకాశం ఉంది. కానీ ఏపీలో అట్లాంటి పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి దేశవ్యాప్తంగా కూడా మీడియా ఒక సందేహ పరిస్థితుల్లోనే ఉంది. కానీ, ఇట్లాంటి వ్యక్తిగత దాడులు మాత్రం ఎక్కడా జరగట్లేదు. అయితే గతం లో కొన్ని పత్రికలను కొన్ని మీడియాలను నిషేధించిన మాట వాస్తవం. ఇది తప్పా రైటా అనేది పక్కన పెడితే నిషేధం అయితే విధించారు దీని మీద న్యాయస్థానాల్లో పోరాటాలు జరిగాయి. తర్వాత అనేక నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు దీనికి భిన్నంగా ఏ చిన్న వ్యతిరేక వార్త వచ్చినా తట్టుకోలేని పరిస్థితి.
ఏ చిన్న వ్యతిరేక ప్రచారం జరిగినా ఓర్చుకోలేని పరిస్థితి మన దేశం లో ఉండటం పత్రికా స్వేచ్ఛకు పెను సంకటంగా మారింది. మేధావులు, విజ్ఞులు ఈ విషయంపై స్పందించకపోతే ఈరోజు దక్కన్ క్రానికల్ కు ఎదురైన పరిస్థితి రేపు మరో పత్రికకు మాత్రం ఎదురు కాదని గ్యారెంటీగా ఏమైనా ఉందా? కాబట్టి మీడియా స్వేచ్ఛను కాపాడుకునేందుకు మీడియానే ముందుకు రావాలి తప్ప వేరొకళ్ళు ఎవరు ముందుకు రారు. కానీ ఈ విషయంలో ఎందుకో మీడియా సంస్థలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ చొద్యం చూస్తూ ఉండడం నిజంగా ప్రజాస్వామ్య దేశంలో శోచనీయం.