ఆప్ ఎంపీల మీద వేటు కత్తి...చట్టం ఏమి చెబుతోంది ?
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏకంగా ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఫిరాయించేశారు. వీరంతా కలిసి బీజేపీలో చేరిపోయారు. ఆప్ కి రాజ్యసభలో పది మంది ఎంపీల బలం ఉంది.;
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏకంగా ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఫిరాయించేశారు. వీరంతా కలిసి బీజేపీలో చేరిపోయారు. ఆప్ కి రాజ్యసభలో పది మంది ఎంపీల బలం ఉంది. అయితే అందులో ఏడుగురు అంటే మూడింట రెండు వంతుల మంది అన్న మాట. దాంతో ఆప్ ని రాజ్యసభలో బీజేపీలో విలీనం చేయడం ద్వారా ఫిరాయింపుల వేటును తప్పించుకోవచ్చు అన్నది ఒక వాదన ఉంది. ఆ దిశగానే యాక్షన్ ప్లాన్ తో ఆప్ ఎంపీలు ఉన్నారని అందుకే ఆ నంబర్ వచ్చేదాకా ఆగి ఒక్కసారిగా ఫిరాయించారని అంటున్నారు. అయితే దీని మీదనే రాజ్యాంగ నిపుణులు తీవ్రంగా చర్చిస్తున్నారు.
విలీనం అంటే రైటేనా :
సాధారణంగా విలీనం విషయంలో ఏ సభలో అయినా స్పీకర్ చెయిర్ లో ఉన్న వారిదే తుది నిర్ణయం అవుతుంది. గతంలో అంటే 2019లో టీడీపీ ఏపీలో ఓడిపోయిన సమయంలో ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క ఎంపీ తప్ప అంతా కలసి బీజేపీలో చేరిపోయారు. దాంతో దానికి విలీనం ముద్ర వేశారు నాటి చైర్మన్ వెంకయ్యనాయుడు. ఇపుడు కూడా అదే అప్లై అవుతుందని అంటున్నారు. అయితే ఆనాడు ఈ విలీనం మీద టీడీపీ తాము సవాల్ చేస్తామని చెప్పింది కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దాంతో ఆ వ్యవహారం సాఫీగా సాగిపోయినట్లు అనిపించింది. ఇపుడు అదే సంప్రదాయం అవుతుందా లేక కొత్త చిక్కులు రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఈ విలీనానికి ఏమైనా ఉంటాయా అన్న చర్చ అయితే సీరియస్ గానే సాగుతోంది.
వీరి భవిష్యత్తు ఏంటి :
ఆప్ నుంచి బీజేపీలోకి చేరిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల జాబితా చూస్తే రాఘవ్ చద్దా, స్వాతి మాలీవాల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, అశోక్ మిత్తల్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జీత్ సాహ్నీ ఉన్నారు. వీరంతా కీలకమైన నేతలుగానే ఆప్లో వ్యవహరిస్తున్నారు. వేరు ఆప్ బీజేపీలో విలీనం చేస్తామని అంటున్నారు.ఆ దిశగా చర్యలకు వేగిరపడుతున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం చూస్తే అది అయ్యే పనేనా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు ఇక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనల గురించి స్పష్టంగా ఉంది. దీని ప్రకారం చూస్తే ఒక సభలోని పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది మరో పార్టీలో చేరితే దానిని ఫిరాయింపుగా కాకుండా విలీనంగా పరిగణిస్తారు. అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే ఇలా ఫిరాయించిన వారి మీద అనర్హత వేటు పడదని అంటున్నారు.
పరిమిత విలీనం చెల్లదు :
అయితే రాజ్యాంగ నిపుణులు అయితే మరో విధంగా స్పందిస్తున్నారు. రాజ్యసభలో మెజారిటీ ఎంపీలు చేరినంత మాత్రాన ఆప్ బీజేపీలో విలీనం అయినట్లు కాదని అంటున్నారు. ఆప్ అన్న పార్టీ విలీనం అయితేనే దానికి రాజ్యాంగ బద్ధత ఉంటుందని చెబుతున్నారు. దీని మీద లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి మాట్లాడుతూ కేవలం రాజ్యసభలోని ఆప్ ఎంపీలు విలీనమైతే సరిపోదని అది కరెక్ట్ కాదని అంటున్నారు. మాతృ సంస్థ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం బీజేపీలో చేరితేనే ఆ విలీనం చెల్లుబాటు అవుతుందని ఆయన లాజిక్ పాయింట్ తో ముందుకు వస్తున్నారు. మరో వైపు ఈ ఎంపీల ఫిరాయింపుల మీద ఏ సభ్యుడు అయినా ఫిర్యాదు చేసినా పిటిషన్ దాఖలు చేసినా దాని మీద రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ చైర్మన్ విలీనం ఓకే అంటే కూడా దానిని ఎవరైనా కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ఆప్ అసలే పట్టుదల గల పార్టీ. పైగా ఇండియా కూటమి మొత్తం ఈ ఇష్యూ మీద సీరియస్ గా ఉంది కాబట్టి దీనిని ఇక్కడితో వదిలిపెట్టదని అంటున్నారు. దాంతో ఏమ్ని జరుగుతుందో చూడాల్సి ఉంది.