కేసీఆర్ అండ్ జగన్...ముందు అక్కడ గెలవాల్సిందే !

ఏపీలో తెలంగాణాలో ఒకే రకమైన రాజకీయం సాగుతున్నట్లుగా ఉంది. ఏపీ తెలంగాణా ఒకప్పుడు ఉమ్మడి ఏపీగానే ఉంది కాబట్టి రాజకీయం సెంటిమెంట్ దాదాపుగా ఒక్కటిగా ఉండవచ్చు.;

Update: 2026-04-25 22:30 GMT

ఏపీలో తెలంగాణాలో ఒకే రకమైన రాజకీయం సాగుతున్నట్లుగా ఉంది. ఏపీ తెలంగాణా ఒకప్పుడు ఉమ్మడి ఏపీగానే ఉంది కాబట్టి రాజకీయం సెంటిమెంట్ దాదాపుగా ఒక్కటిగా ఉండవచ్చు. కానీ రాజకీయ పార్టీలకు కష్టాలు సమస్యలు అన్నీ ఒక్కలాగానే ఉండడమే విశేషం. ఏపీలో విపక్షంలో వైసీపీ ఉంది. అలాగే తెలంగాణాలో బీఆర్ఎస్ ఉంది. ఈ రెండు పార్టీల అధినేతలు జగన్ కేసీఆర్ మంచి మిత్రులు అని చెబుతారు. ఈ ఇద్దరూ ఒకరి మేలు మరొకరు కోరుకుంటారు అని అంటారు. ఈ ఇద్దరికీ ఉమ్మడి ప్రత్యర్థులు కూడా ఉన్నారు అందులే స్నేహం కలిసింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఇంటి పోరు చూస్తే :

ఇంటి పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినుర వేమా అని ఏనాడో ఆరు వందల ఏళ్ల క్రితం వేమన చెప్పారు. అది నిజం కూడా ఇంటిలో బాగుంటే బయట రాణించగలరు, రచ్చ చేయగలరు, కానీ ఇంట్లోనే సమరం సాగితే తట్టుకోవడం ఎవరికైనా అసాధ్యమే. నిన్నటి దాకా జగన్ అదే పడుతున్నారు. జగన్ బాధ ఏకంగా అయిదేళ్ళ వయసుది అయితే కేసీఆర్ బాధ అందులో మూడవ వంతు. ఇపుడు చూస్తే మరింతగా సౌండ్ పెరిగింది. కవిత ఏకంగా పార్టీ పెట్టేశారు. దాని పేరు కూడా టీఆర్ఎస్. దాంతో నేరుగా కారు పార్టీని సారు వారినీ టార్గెట్ చేసారు అని అంటున్నారు.

జగన్ అనుభవం:

సొంత ఇంట్లో రక్త బంధంతో వైరం ఎంతటి అనర్ధాలు తెస్తుందో ఎంతటి అపజయాలను అందిస్తుందో జగన్ కి స్వీయానుభవం. కేసీఆర్ కి అయితే అది ఇంకా లేదు కానీ ఇపుడు చూస్తే కవిత రూపంలో కనిపించబోతోంది అని అంటున్నారు. అసలే విపక్షంలో ఉన్న పార్టీకి ప్రతీ ఓటూ కీలకంగా ఉంటుంది. అందరినీ కలుపుకుని పోవాల్సి ఉంటుంది. కానీ విపక్షంలో ఉన్న జగన్ కి కేసీఆర్ కి ఆ సౌఖ్యం లేనట్లుగా ఉంది. పార్టీలో ఉన్న వారిలో హుషార్ లేదు, చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఇక నేరుగా ప్రత్యర్థిని ఢీ కొడదామంటే ఆడబిడ్డలు అడ్డం పడుతున్నారు. ముందు వారితోనే తేల్చుకోవాల్సి ఉంది. ఆ మీదటే ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంది.

అది మాత్రం గ్యారంటీ :

కవిత పార్టీ వల్ల ఆమెకు ఏ మేరకు లాభం కలుగుతుందో ఎవరికీ తెలియదు కానీ నష్టం అయితే కారు పార్టీకే అని అపుడే విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల్లో చూస్తే ఒక పార్టీ గుర్తుని పోలిన మరో గుర్తు వస్తేనే ఓట్లలో చీలిక వస్తుంది. అలాంటిది టీఆర్ ఎస్ పేరుతోనే కవిత పార్టీ మొదలెట్టారు అంతే కాదు కేసీఆర్ మీదనే యుద్ధం ప్రకటించారు. దాంతో ఆమె గెలిచినా లేక గెలవకపోయినా కేసీఆర్ కుమార్తె ఇమేజ్ ఉంటుంది. దాంతో పాటు ఓట్ల చీలిక అయితే కచ్చితంగా చేస్తారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమైనా దారుణమైన ఓటమి మాత్రం షర్మిల వల్ల వచ్చిందని విశ్లేషణలు ఉన్నాయి. అసెంబ్లీకి సైతం పోలేని విధంగా 11 సీట్లకు వైసీపీ పడిపోయింది అంటే రాయలసీమలో షర్మిల ఓట్ల చీలిక ఎంతో కొంత పనిచేసింది అని చెబుతారు.

పేగు బంధాలతోనే :

సవాళ్ళు సాధారణంగా బయట నుంచి వస్తాయి. కానీ పేగు బంధాలతోనే సవాళ్ళు రావడం అన్నది మాత్రం రాజకీయంగా ఎవరూ కోరుకోరు. కానీ కేసీఆర్ కి జగన్ కి ఆ కష్టాలు వచ్చి పడుతున్నాయి. పరిస్థితి చేయి దాటేసింది. దాంతో ఇంటి వారితో సొంత వారితో పోరాటం చేయాలి. గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డలే కదా అన్న సెంటిమెంట్ ఉంటుంది. అలా కాదని ఊరుకుంటే వారు చేసే రాజకీయ రచ్చతో పార్టీలు పూర్తిగా ఇరకాటంలో పడతాయి. మొత్తానికి ఈ ఇద్దరు నేతలకు గడ్డు కాలమే వచ్చింది అని అంటున్నారు. దీనిని దాటుకుని ప్రత్యర్థుల మీద పోరు సాగించాల్సిన వ్యూహాలతోనే ముందుకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News