ఆ 'పది'లక్షల మంది ఎటు వైపు ?

అయితే ఈ సారి నమోదయిన వారిలో కొత్తగా 10 లక్షల మంది యువత తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Update: 2024-05-12 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేళ్ల జగన్ వైఫల్యాలను, ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డ తీరును, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైనాన్ని, అన్ని రంగాలలో జగన్ వైఫల్యాలను విమర్శిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది. ఈ సారి ఎన్నికలలో తమ కూటమి గెలుపు ఖాయం అని భావిస్తున్నాయి.

2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్దిని పక్కనపెట్టారని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించాడని, అన్ని రంగాలలో ఏపీని వెనకబాటుకు గురిచేశాడని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారంలో కూటమి విమర్శలను తిప్పికొట్టాడు. 2014లో ఉన్న కూటమి అధికారం కోసం మళ్లీ 2024లో ప్రజల ముందుకు వస్తున్నదని, వారి మాటలు పట్టుకుంటే మునగడం ఖాయం అని, 2019 ఎన్నికలలో వైసీపీ ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చామని, మరోసారి తమ పార్టీని ఆదరిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తానని జగన్ చెబుతున్నాడు.

మరి ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అన్నది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమీషన్ వెల్లడించింది. ఈ సారి కొత్తగా 22 లక్షల మందిని చేర్చగా 16 లక్షల మందిని తొలగించారు. అయితే ఈ సారి నమోదయిన వారిలో కొత్తగా 10 లక్షల మంది యువత తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరు ఈ ఎన్నికలలో ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది రాజకీయ పార్టీలను కలిచి వేస్తున్నది.

ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 92,53,220 ఓట్లు రాగా, అధికారంలో కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 85,81,549 ఓట్లు వచ్చాయి. బీజేపీ పార్టీకి 30,31,031 ఓట్లు మాత్రమే వచ్చా యి. బీఆర్‌ఎస్‌ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్లు ఏడు లక్షలు (1.8 శాతం) మాత్రమే ఎక్కువ. ఈ స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ 39 స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ 64 స్థానాలను గెలుచుకుని అధికార పీఠం అందుకుంది. ఏపీలోనూ ఎన్నికల సమరం పోటాపోటీగానే ఉన్న నేపథ్యంలో యువ ఓటర్ల నిర్ణయం రాజకీయ పార్టీల భవిష్యత్ నిర్ణయించనున్నది.

Tags:    

Similar News