ఏపీలో మనుషులను మోసుకెళ్లే డ్రోన్ అంబులెన్సులు.. ఎప్పటినుంచంటే..!
వరదలు, తుఫానుల సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతాయన్న సంగతి తెలిసిందే.;
వరదలు, తుఫానుల సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతాయన్న సంగతి తెలిసిందే. అటు గోదావరికి కానీ, ఇటు కృష్ణాకు గానీ వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలు మొత్తం నీట మునిగిపోతాయి. ఈ సమయంలో ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ లను ఉపయోగించి అవసరమైన వస్తువులు, మందులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈసారి నేరుగా మనుషులను మోసుకెళ్లే డ్రోన్ అంబులెన్సులపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది.
అవును... చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అనారోగ్యం పాలైన వారిని, గర్భిణీ స్త్రీలను సైతం నలుగురు మనుషులు మోసుకుని ఆస్పత్రికి తిసుకెళ్తున్న ఘటనలు మీడియాలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయిన తర్వాత కూడా అలాంటి దృశ్యాలు కనిపించడం అత్యంత దయణీయమైన పరిస్థితే. ఈ సమయంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ మనుషులను మోసుకెళ్లే డ్రొన్ అంబులెన్సులపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో... ప్రపంచంలోనే మొట్టమొదటి దీర్ఘ-శ్రేణి, మానవులను మోసుకెళ్లే డ్రోన్ అంబులెన్స్ ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలోని డాక్టర్ కలాం అడ్వాన్స్డ్ యుఏవీ రీసెర్చ్ సెంటర్ (సీ.ఏ.ఎస్.ఆర్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అత్యవసర ఆరోగ్య సంరక్షణ డెలివరీని మార్చడానికి రూపొందించబడిన ఈ డ్రోన్ అంబులెన్స్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని, 90 నిమిషాల వరకు విమాన ప్రయాణాన్ని కలిగి ఉంటుంది.
ఈ సందర్భంగా స్పందించిన సీ.ఏ.ఎస్.ఆర్ డైరెక్టర్ డాక్టర్ కె. సెంథిల్ కుమార్ స్పందిస్తూ.. అన్నా యూనివర్సిటీ టెక్నాలజీ అమలు భాగస్వామి అని, బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బీ.వీ.ఎల్.ఓ.ఎస్) డ్రోన్ ఆపరేషన్ ఫ్రేమ్ వర్క్ ల సూత్రీకరణకు నాయకత్వం వహిస్తుందని తెలిపారు. ఈ సమయంలో.. అత్యవసర కార్యకలాపాల కోసం రియల్ టైమ్ ట్రాకింగ్, రియల్ టైమ్ ఫ్లైట్ ప్లానింగ్, రూట్ ఆమోదం కోసం ఆపరేటర్లకు యూనిఫైడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ (యూటీఎం) సహాయపడుతుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అన్నీ అనుకూలంగా జరిగితే ఈ ఏడాది మే లో మొదటి డ్రోన్ ఎగిరే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో... ఇది ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి మరో కీలక ముందడుగని అంటున్నారు పరిశీలకులు.