కాంగ్రెస్ కాలింగ్.. పార్టీ ఎంపీలకు మాజీ సీఎం జగన్ సీరియస్ వార్నింగ్
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికాయి.;
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికాయి. అయినా, విపక్ష కూటమి నిలబెట్టిన రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగు సెంటిమెంట్ తో పార్టీలపై ఒత్తిడి తేవాలని చూస్తోంది. అయితే ఎన్డీఏలోని భాగస్వాములైన టీడీపీ, జనసేన విపక్ష కూటమి పాచికలను తిప్పికొట్టగా, వైసీపీ మాత్రం తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో కాంగ్రెస్ హైకమాండులోని పెద్దలు నేరుగా చర్చిస్తుండటం వైసీపీలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాలపై అధినేత జగన్ కూడా సీరియస్ అవుతున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైసీపీకి బీజం వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి. 2011 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తన ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో తనకు రాజకీయంగా విరోధి అయినప్పటికీ బీజేపీ బలపరిచిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ కూడా అధికారికంగా పార్టీ అధినేత జగన్ ను సంప్రదించి, మద్దతు కోరింది. దీంతో బీజేపీ అడగడం, జగన్ కాదనలేకపోవడం జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి వైసీపీ మద్దతు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని అంటున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ అధినేత జగన్ ను కలవాలని భావించినప్పటికీ, అప్పటికే వైసీపీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆమె ఆగిపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు మద్దతు కోసం వైసీపీ అధినేతను సంప్రదించని కాంగ్రెస్.. ఆ పార్టీ ఎంపీలతో నేరుగా మాట్లాడుతోంది. తెలుగు సెంటిమెంటు ప్రయోగిస్తూ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరుతోందని అంటున్నారు. వైసీపీకి నలుగురు పార్లమెంటు సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉండగా, ఇందులో దాదాపు నలుగురితో కాంగ్రెస్ చర్చలు సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రాజంపేటకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘురామిరెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ఇంటికి పిలిచి మాట్లాడారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కావాలని ఇంతవరకు అధికారంగా ప్రయత్నాలు చేయకపోయినా, ఆ పార్టీకి చెందిన ఎంపీలతో నేరుగా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ పరిణామంతో పార్టీ ఎంపీలపై అధినేత జగన్ కు పట్టులేదన్న సంకేతాలు పంపుతోందని పార్టీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేత జగన్ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మద్దతు కోసం కాంగ్రెస్ సంప్రదిస్తే తమ అధిష్టానంతో మాట్లాడమని చెప్పాల్సిన ఎంపీలు.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ మేడా రఘురామరెడ్డి నేరుగా ఖర్గేను కలవడం, తనకు ఆయనతో 30 ఏళ్ల అనుబంధం ఉందని సమర్థించుకోవడం కరెక్టు కాదన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో స్నేహం ఉండటం సహజమే అయినప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ప్రత్యర్థులతో కలిసిమెలిసి తిరిగితే తప్పుడు సంకేతాలు వెళతాయన్న విషయం తెలియదా? అంటూ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
ఇక ఈ పరిణామంపై పార్టీ అధినేత జగన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ తో మాట్లాడుతున్న ఎంపీలపై జగన్ కన్నెర్ర చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ను వ్యతిరేకించడం తన విధానమని తెలిసినా, పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పెద్దలతో ముచ్చటించడమేంటని జగన్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తనను అరెస్టు చేయించి జైలు పాలుచేసిన పార్టీకి మద్దతు ఎలా చెబుతారని జగన్ తమ పార్టీ ఎంపీలను నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. తనను రాజకీయంగా అణగదొక్కాలని చూడటమే కాకుండా ఇప్పటికీ తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందని మాజీ సీఎం జగన్ భావిస్తున్నారని, ఏపీసీసీ చీఫ్ షర్మిల, కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ వ్యవహారాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు కాంగ్రెస్ కు దూరంగా జరగాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం వైసీపీ ఎంపీలను వదలకుండా వెంట పడుతోందని చెబుతున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేయకపోయినా ఫర్వాలేదు కానీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయవద్దని కోరుతున్నట్లు తాజా సమాచారం. దీంతో వైసీపీ ఎంపీలు తలలు పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ ఈ రాజకీయ ఎత్తుగడలు పదునెక్కుతుండటంతో ఎలా నెగ్గుకురావాలని ఎంపీలు తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు. అధినేత జగన్ కూడా కాంగ్రెస్ పై సీరియస్ గా ఉండటంతో ఎంపీలు ఏం చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.