విశాఖలో ఆంధ్రా మండపం.. సీఐఐ సమ్మిట్ విశేషాలివే..

విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులు జరగనున్నఈ సదస్సును ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు.;

Update: 2025-11-14 09:04 GMT

విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులు జరగనున్నఈ సదస్సును ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. ఈ సదస్సుకు 522 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 72 దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు. మొత్తం 2,500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోనే అత్యంత సుందరమైన నగరంగా విశాఖకు ఉన్న గుర్తింపుతోపాటు అత్యంత సురక్షిత నగరంగా ఇటీవల తెచ్చుకున్న రేటింగ్ ద్వారా విశాఖను పెట్టుబడులకు గేట్ వేగా మార్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ప్రొత్సాహకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు ఓపెన్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రొత్సాహకాలకు సావరీన్ గ్యారెంటీ ఇస్తామని కూడా సీఎం స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఏపీలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, రియల్ టైమ్‌లో అనుమతులు ఇవ్వటంతో పాటు వేగంగా పరిశ్రమలు నిర్మించేలా చూస్తున్నామని సీఎం తెలిపారు.

అందుబాటులోకి డ్రోన్ ట్యాక్సీలు

“ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను భారతీయులే నడిపిస్తున్నారు. ఏపీలో త్వరలోనే క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నాం. డ్రోన్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, స్పేస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పని చేస్తున్నాం. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీలతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ధిక వ్యవస్థలను నిర్మించటంతో పాటు సంపద సృష్టించటంలో కలసి పని చేద్దాం. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ ఉత్పత్తులు, పర్యాటకం ఇలా వేర్వేరు రంగాల్లో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నాను.’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. డీప్ టెక్నాలజీ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. ఏరో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తున్నాం. త్వరలోనే భారత్‌లో అది కూడా ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ అపారంగా ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు అవకాశాలు. పోర్టులు, డ్రైపోర్టులు, అంతర్గత జలరవాణా, హెల్త్ కేర్ రంగాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్రిటెక్, ఈవీ టెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా విస్తృతమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాను.”అని సీఎం చెప్పారు.

పెట్టుబడులను ప్రొత్సహించేలా సంస్కరణలు

“విశాఖలో వాణిజ్యపరమైన ఎగ్జిబిషన్లు, ప్రదర్శనలకు వీలుగా ఐటీపీఓ ద్వారా ఆంధ్రా మండపం నిర్మించేందుకు స్థలం కేటాయిస్తామని హామీ ఇస్తున్నాం. భారత్ మండపం తరహాలోనే ఆంధ్రా మండపం నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. విశాఖ వచ్చిన వారికి అరకు లాంటి ప్రాంతాలను కూడా సందర్శించాలి. అలాగే స్థానిక గిరిజనులు పండిస్తూ గ్లోబల్ బ్రాండ్ గా మారిన అరకు కాఫీని, స్థానిక ఆక్వా రుచుల్ని ఆస్వాదించాలి. రాష్ట్రంలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదు. వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నాం. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. అవసరమైన సంస్కరణలు కూడా తెచ్చాం. కేవలం 17 నెలల కాలంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 20 లక్ష ఉద్యోగాలు కూడా దక్కుతాయి. ప్రస్తుతం 0.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు 50 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ఏపీ పనిచేస్తుంది. వచ్చే పదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తామనే విశ్వాసం మాకుంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఈ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసం మాత్రమే కాదు.. మేథోపరమైన, ఆవిష్కరణలపైనా చర్చలు జరగాలి.”అని సీఎం చంద్రబాబు సూచించారు.

Tags:    

Similar News