రెడ్ బుక్ డిజిటల్ బుక్ కేడర్ కి ఏమైనా పనికొస్తాయా ?
కట్ చేస్తే కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యంగం నడుస్తోంది అని వైసీపీ ఘాటుగా ఆరోపిస్తోంది. ఇపుడు దానికి కౌంటర్ అన్నట్లుగా వైసీపీ డిజిటల్ బుక్ అంటోంది.;
ఏపీలో బుక్కుల గోల ఎక్కువ అయింది అని అంటున్నారు. గత టీడీపీ విపక్ష జమానాలో రెడ్ బుక్ ని నారా లోకేష్ పరిచయం చేశారు. ఎందుకు ఈ బుక్ అంటే వైసీపీ ఏలుబడిలో నష్టపోయిన వారిని ఆదుకుంటామని బాధ్యులనే శిక్షిస్తామని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యంగం నడుస్తోంది అని వైసీపీ ఘాటుగా ఆరోపిస్తోంది. ఇపుడు దానికి కౌంటర్ అన్నట్లుగా వైసీపీ డిజిటల్ బుక్ అంటోంది. దానిని స్వయంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఓపెన్ చేశారు. ఈ బుక్ కూడా సేమ్ డిటో. తాము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ వార్ స్టార్ట్ అయిపోయింది.
ఇదేనా ఇచ్చే హామీ :
ఏ రాజకీయ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని చెప్పాలి. ఫలానా మంచి పని చేస్తామని కూడా చెప్పాలి. కానీ ఈ బుక్ లను ఓపెన్ చేయడం ద్వారా నేతాశ్రీలు చెబుతున్నది ఏమిటి అంటే తమకు పవర్ అప్పగించండి ఆనక అరెస్టులు చేస్తామని. అంటే ఎవరికి నచ్చని గిట్టని ప్రత్యర్ధులను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని అర్ధం అవుతోంది. అందుకోసమే అధికారం అని చాలా ఓపెన్ గానే చెబుతున్నారు అని విమర్శలు వస్తున్నారు. ఒక విధంగా ఇది ఫ్యాషన్ అయిపోయింది అని అంటున్నారు. మేము వస్తే అరెస్టులు అని ఘనంగా చెప్పుకోవడమేంటి అని చర్చ కూడా సాగుతోంది.
రెడ్ బుక్ తో సాధించిందేంటి :
రెడ్ బుక్ అంటూ ఎన్నికల ముందు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అరెస్టుల పర్వం సాగించారు అయితే తమను అక్రమంగా అరెస్టులు చేశారు అని వైసీపీ వారు మండిపోయారు. రెడ్ బుక్ వల్లనే ఇదంతా అని రాద్ధాంతం చేశారు. అయితే రెడ్ బుక్ ద్వారా ఎంతో మందిని అరెస్టులు చేశారని లోకేష్ టీం ఎప్పటికపుడు చెబుతూ వస్తోంది అని అంటునారు. అంటే దీని ద్వారా రాష్ట్రానికి కానీ లేదా ప్రజలకు కానీ సాలిడ్ గా జరిగే మేలు ఏమైనా ఉందా అంటే మాత్రం జవాబు లేదు కదా అని సగటు జాలు నిట్టూరుస్తున్నారు.
డిజిటల్ బుక్ తో ధాటీగానే :
ఇక డిజిటల్ బుక్ ఓపెన్ చేసిన వారు చెబుతున్నది గట్టిగానే ఉంది. ఎవరైతే ఈ అయిదేళ్ళలో ఇబ్బందులు పెడతారో వారిని ఖండాంతరాలు దాటినా సరే తెచ్చి చట్టం ముందు పెట్టి శిక్షిస్తామని అంటున్నారు. ఒక విధంగా ధాటీగానే చెబుతున్నారు. ఇది రాసి పెట్టుకోండి అని అంటున్నారు. తాట తీస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.
సభ్య సమాజానికి సందేశం :
అదేదో సినిమాలో ఒక హీరో అన్నట్లుగా సభ్య సమాజానికి ఈ బుక్ ల ద్వారా ఇస్తున్న సందేశం ఏమిటి అన్న చర్చ అయితే కచ్చితంగా వస్తోంది. ఎందుకంటే రాజకీయ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడానికి ఎవరూ అధికారం ఇవ్వరు అన్నది ఒక స్పష్టమైన మాట. తమ జీవితాలు నిన్నటి కంటే నేడూ రేపూ ఏమైనా మెరుగుదలతో ఉంటాయని అనుకుంటే మాత్రం ఆయా పార్టీల వైపు జనాలు మొగ్గు చూపిస్తారు. వారికి అధికారం అప్పగిస్తారు. ఆ విధంగా జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవాలి తప్ప ఈ బుక్కులను ముందు పెట్టి సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఉంటుందని గ్రహించాలని సూచిస్తున్నారు.
డీమోరలైజ్ అవుతారు :
చట్టం ఉంది. రాజ్యాంగం ప్రకారం అది పనిచేస్తుంది. తప్పు ఎవరు చేసినా వారిని శిక్షిస్తుంది. దానికి ఈ బుక్కులు ఏవీ అవసరం లేదు అని అంటున్నారు. ఇక ఏకపక్షంగా ఎవరైనా కక్షల కోసం అరెస్టులు చేసినా అడ్డుకోవడానికి కోర్టులు ఉన్నాయి. అందువల్ల ఎదురు బొదురు నిలిచి వారిని వీరు వీరిని వారు అరెస్టు చేసుకోవడానికి పవర్స్ అన్నది పూర్తిగా ఇబ్బంది కలిగించే వ్యవహారంగా చూడాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల వ్యవస్థలు డీ మోరలైజ్ అవుతాయని అంతే కాకుండా ఏపీ వైపు చూడాలని ఆలోచించేవారు కూడా పునరాలోచన పడతారు అని అంటున్నారు.
క్యాడర్ ఏమి కోరుతోంది :
నిజానికి క్యాడర్ కోరుకునేది ఎవరినో అరెస్ట్ చేసి తమ కళ్ళలో ఆనందం నింపమని కాదు, తమకు ఏదైనా మంచి జరిగేలా చూడమని, తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడమని. అంతే కాదు తమ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే తమకు ఏమైనా మేలు జరగకపోతుందా అన్న ఆశతో వారు ఉంటారు. ఇపుడు రెడ్ బుక్ ల ద్వారా బడా నేతలు కానీ కీలక నేతలు కానీ అరెస్టు అయ్యారు. రేపు డిజిటల్ బుక్ ద్వారా కూడా కోట్లు తిన్న వారు అరెస్టు అవుతారు. దాని వల్ల ఏ పార్టీ క్యాడర్ కి అయినా ఒరిగింది ఏముంది అని ప్రశ్నిస్తున్నారు అందువల్ల ఒక గుడ్ బుక్ ని ఓపెన్ చేసి తమ కోసం పార్టీ కోసం పనిచేసిన క్యాడర్ పేర్లు అందులో రాసుకుంటే మేలు అంటున్నారు. రేపటి రోజున పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి తగిన న్యాయం చేయవచ్చు. అంతే తప్ప రామకోటి మారిదిగా ఈ తప్పుల లెక్కలు పాపుల చిట్టాలు రాసుకుని ఆ మీదట అరెస్టులు అంటూ హడావుడి చేయడం వల్ల పొలిటికల్ గా ఇగో సాటిస్ఫై అవుతుంది తప్ప క్యాడర్ కి మాత్రం జరిగేది ఏమీ ఉండదని అంటున్నారు.