"మా ఉసురు తగులుతుంది!" ఓజీ డైలాగ్‌తో పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఘాటు వ్యాఖ్యలు
జనసేన ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, జనసేన నేతలే తమ గిరిజన కుటుంబాన్ని కించపరిచే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.;
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సుగాలి ప్రీతి మృతి కేసు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈసారి ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సుగాలి ప్రీతి తల్లి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న తమకు ఎనిమిదేళ్లుగా అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, తన పోరాటాన్ని అడ్డుకుంటే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులపై "ఉసురు" తగులుతుందని హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
* ఓజీ డైలాగ్‌తో తీవ్ర హెచ్చరిక
పార్వతి చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకం, ప్రజల దృష్టిని ఆకర్షించింది 'ఓజీ' సినిమా డైలాగ్‌ను ప్రస్తావించడం.. "ఓజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది.. ‘చాలామంది చాలా చేస్తున్నారు.. ఉసురు తగులుతుంది అని...’ నా కూతురికి న్యాయం జరగకపోతే నా ఉసురు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లకు తగులుతుంది" అంటూ ఆమె ఘాటుగా హెచ్చరించారు.
* ఎనిమిదేళ్లయినా న్యాయం జరగలేదంటూ ఆవేదన
2017లో జరిగిన తన కుమార్తె సుగాలి ప్రీతి మృతిపై అప్పట్నుంచి నిరంతరం పోరాడుతున్నప్పటికీ, ప్రభుత్వాలు మారినా తమ బాధ మాత్రం మారలేదని పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. "ప్రభుత్వాలు మారినా మా బాధ మారలేదు. నిందితులకు ఇంకా శిక్షపడలేదు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పిన మాటలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు?" అని ఆమె పాలక పక్షాన్ని ప్రశ్నించారు.
* పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం, ప్రశ్నల వర్షం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ సమస్యలపై స్పందించకపోవడంపై పార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "సూపర్ సిక్స్ పథకాల గొప్పలు చెబుతున్నారు, కానీ బాధితుల సమస్యలు పట్టించుకోవడం లేదు." "పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఒక్కసారైనా మా కేసు గురించి మాట్లాడారా?" అంటూ నిలదీశారు.
జనసేన ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, జనసేన నేతలే తమ గిరిజన కుటుంబాన్ని కించపరిచే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. "పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయారు. న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నారు. ఇది నమ్మకద్రోహం కాకపోతే మరేమిటి?" అని మండిపడ్డారు.
వీల్‌చైర్ యాత్రకు అనుమతి డిమాండ్, మోదీని కలవాలని ప్లాన్
తమ వీల్‌చైర్ యాత్రకు కూడా అడ్డంకులు సృష్టించారని పార్వతి ఆరోపించారు. "చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్ వీల్‌చైర్ యాత్రకు అనుమతి ఇప్పించాలి" అని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ నెల 16న కర్నూలులోకి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి న్యాయం కోసం విన్నవించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. మోదీని కలిసే అవకాశం ఇవ్వకపోతే "13, 14, 15 తేదీల్లో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తాను. అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తాను" అని స్పష్టం చేశారు.
సుగాలి ప్రీతి కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారడంతో, దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేదా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.