కొత్త జిల్లాలపై పక్కా పొలిటికల్ స్ట్రాటజీ.. చంద్రబాబు వ్యూహం అదిరిపోయేలా ఉందే?

వచ్చే ఏడాది జనగణనకు కేంద్రం నిర్ణయించినందున ఈలోగా జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.;

Update: 2025-10-30 17:30 GMT

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. వచ్చే ఏడాది జనగణనకు కేంద్రం నిర్ణయించినందున ఈలోగా జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చాలావరకు మార్చాలని చూస్తున్న ప్రభుత్వం.. తమకు రాజకీయంగా ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటుందని అంటున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి రాజకీయంగా మేలు జరుగుతుందంటేనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మంత్రి వర్గ ఉప సంఘానికి సూచనలిచ్చినట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాలు ఉంటే, గత ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు అవ్వాల్సివుండగా, భౌగోళిక స్వరూపం కారణంగా అరకు నియోజకవర్గాన్ని రెండుగా విభజించారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాలు 26 అయ్యాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ప్రజల అభిప్రాయానికి పెద్దగా విలువనివ్వని అప్పటి సర్కారు పెద్దలు.. తాము అనుకున్నట్లు పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు.

దీనివల్ల అప్పటి ప్రభుత్వానికి మేలు జరగకపోగా, ప్రజాగ్రహం చవిచూడాల్సివచ్చింది. నిజానికి ఏపీలో చాల కాలం నుంచి కొత్త జిల్లాల డిమాండ్లు వినిపించాయి. పార్వతీపురం, మదనపల్లె, మార్కాపురం ఇలా చాలా జిల్లాల ప్రతిపాదనలు దశాబ్దాలుగా వినిపించేవి. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా తీసుకోవడంతో పార్వతీపురం డిమాండ్ పరిష్కారమైంది. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మదనపల్లె, మర్కాపురం జిల్లాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ, నరసాపురం వంటి ప్రాంతాల్లో లేనిపోని వివాదాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని అంటున్నారు.

నిజానికి ఏ ప్రాంతమైనా కొత్త జిల్లా, కొత్త రెవెన్యూ డివిజన్ అయిందంటే ఆ ప్రాంతీయుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఏర్పాటైన జిల్లాల వల్ల ప్రభుత్వానికి మేలు జరగకపోగా, ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుందని విశ్లేషణలు వచ్చాయి. అంతేకాకుండా జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఎక్కడ శాశ్వత ప్రాతిపదికన కలెక్టరేట్లు నిర్మించలేకపోయింది. దీంతో తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోంది.

ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసేలా మదనపల్లె, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని చూస్తోంది. అదేవిధంగా తిరుపతిలో ఉన్న గూడూరును నెల్లూరులో కలిపి, చిత్తూరులో ఉన్న నగరిని తిరుపతిలో విలీనం చేయాలని చూస్తోంది. ఇవన్నీ రాజకీయంగా టీడీపీ కూటమికి మేలు చేసే నిర్ణయాలేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా చాలా జిల్లాల సరిహద్దులు మార్చి పాలనా సౌలభ్యం మెరుగుపరచుకోవాలని భావిస్తున్నారు.

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్న ప్రాంతాలను వాటికి సమీపంలో ఉండే జిల్లాల్లో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా విజయవాడ నగరం చుట్టూ ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపేలా పావులు కదుపుతోంది. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు జరుగుతోందని అంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా నష్టం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించడం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో గరిష్టంగా లబ్ధి జరిగేలా ఆయన పావులు కదుపుతున్నట్లు భావించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News