రేపే కూటమి విజయోత్సవం.. మూడు ప్రాంతాల ఎంపిక!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా మూడు ప్రాంతాల్లో విజయోత్సవ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 9న తిరుపతిలో కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభను గ్రాండ్‌గా నిర్వహించాలని తాజాగా అధికారులను అదేవిధంగా పార్టీ నాయకులను కూడా ఆదేశించారు.
ఆదివారం సాయంత్రం ఉండవల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి కూటమి పార్టీల ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. విజయోత్సవ సభకు అందరూ హాజరు కావాలని, ముఖ్య నాయకులతో పాటు మంత్రులు క్షేత్రస్థాయి ఇన్చార్జిలను కూడా ఆహ్వానించాలని ఆయన సూచించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి, తీసుకు వచ్చిన పెట్టుబడులు, ఇచ్చిన ఉద్యోగాలు ఇలా అన్ని విధాల మేలు జరిగిందని తెలిపారు.
ఆయా విషయాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూటమి పార్టీలపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో విజయోత్సవ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తొలి విడత తిరుపతిలో, తర్వాత విశాఖపట్నంలో, అనంతరం రాజధాని అమరావతిలోనూ విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్దేశించారు. ఈ సభలకు క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలతో పాటు నాయకులను కూడా తరలించాలని ఆదేశించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందో ఈ సభ ద్వారా వివరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా విజయోత్సవ సభలను గ్రాండ్‌గా నిర్వహించాలని చంద్రబాబు తెలిపారు.
ఇగోలు వద్దు!
ఈ సందర్భంగా కూటమిలోని కొందరు నాయకులను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఇగోలకు పోవద్దని సూచించారు. అందరూ కలివిడిగా ఉంటే ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గత ఎన్నికలకు ముందు ఏవిధంగా పట్టుదలతో పనిచేశారో.. ఇప్పుడు కూడా అలానే ఉండాలన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే అందరూ కలసి కట్టుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందన్నారు. విజయోత్సవ సభలు దానికి నాందిపలుకుతాయన్నారు. అందరూ ఈ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇగోలు పెట్టుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను ఇబ్బంది పెట్టరాదని ఆదేశించారు.