శాసనమండలిలో మళ్లీ రచ్చ.. శ్రీవారి ఫొటోలు ప్రదర్శనపై సర్కార్ ఆగ్రహం
ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. విపక్షం వైసీపీ దూకుడు చూపడం, అధికార పార్టీ అందుకు తగ్గట్టే ఎదురుదాడి చేస్తుండటంతో సభలో రచ్చ కంటిన్యూ అవుతోంది.;
ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. విపక్షం వైసీపీ దూకుడు చూపడం, అధికార పార్టీ అందుకు తగ్గట్టే ఎదురుదాడి చేస్తుండటంతో సభలో రచ్చ కంటిన్యూ అవుతోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ డెయిరీతో ఉన్న సంబంధంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టడం తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఇప్పటికే ఈ అంశంపై చర్చించేందుకు రెండు రోజులు పాటు వరుసగా వాయిదా తీర్మానాలు ఇచ్చింది వైసీపీ. వైసీపీ వాయిదా నోటీసులను చైర్మన్ తిరస్కరించగా, శుక్రవారం సభలో శ్రీవెంకటేశ్వరస్వామి ఫొటోలను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా స్వామి వారి ఫొటోలను విసిరేసిన వైసీపీ ఎమ్మెల్సీలు మహాపరాధం చేశారని టీడీపీ సభ్యులు ఆరోపించారు.
మండలిలో దేవదేవుడి చిత్రపటాలను ప్రదర్శించి వైసీపీ సభ్యులు మహాపరాధం చేశారని అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. రాజకీయాల కోసం వెంకటేశ్వరుడి బొమ్మలు వాడటాన్ని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ తప్పుబట్టారు. ఈ విషయమై సభలో గట్టిగా మాట్లాడిన ఆర్థిక మంత్రి కేశవ్ వైసీపీ సభ్యుల చర్యను ఖండించాలని కోరారు. అదేసమయంలో కాళ్లకు చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోలను ప్రదర్శించడాన్ని తప్పుపట్టారు. ఇది శ్రీవారికి చేసిన మహాపరాధంగా అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు.
హెరిటేజ్ అంశంపై చర్చించాలని పట్టుబడుతున్న వైసీపీ సభ్యులు వెంకటేశ్వరస్వామి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ పోడియం చుట్టుముట్టారు. నినాదాలు చేస్తూ సభ స్తంభించాలని ప్రయత్నించారు. ఇటు వైసీపీ సభ్యులు, అటు అధికార కూటమి సభ్యులు పోటాపోటీ నినాదాలతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో చైర్మన్ మండలిని పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
అయితే సభలో వెంకటేశ్వరసామి చిత్రపటాలను ప్రదర్శించడంతోపాటు కాళ్లకు చెప్పులు వేసుకుని శ్రీవారి ఫొటోలను పట్టుకోవడాన్ని అధికార పార్టీ ఎత్తిచూపింది. పరమ పవిత్రంగా పూజించే శ్రీవారు అంటే వైసీపీకి భక్తి లేదని, మహాపరాధం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలను మీడియా పాయింట్ వద్ద విపక్ష సభ్యులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తాము చెప్పులు వేసుకుని శ్రీవారి ఫొటోలు పట్టుకోలేదని వివరణ ఇచ్చారు. అయితే మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోలు ప్రదర్శిస్తున్న ఫొటోలు, వీడియోలను ప్రభుత్వం బయటపెట్టింది.
వైసీపీ సభ్యుల చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ప్రభుత్వం ధ్వజమెత్తింది. వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆర్థిక మంత్రి కేశవ్ మండిపడ్డారు. సభలో ప్రతిరోజూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ సభ్యుల తీరును ఆయన ఎండగట్టారు. వైసీపీ సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారని పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏమిటని వైసీపీ సభ్యులను మంత్రి పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. బీజేపీ కూడా ఈ అంశంపై స్పందించింది. చెప్పులేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో దేవుడి ఫొటోలను విసిరేశారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడు అంటే మాజీ సీఎం జగన్మోహనరెడ్డి భక్తి, భయం లేవని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.