వాట్సాప్ లోనే ఫిర్యాదులు, పరిష్కారాలు.. ఏపీలో సరికొత్త రూల్స్!
ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
సాధారణంగా ఒక ప్రభుత్వ కార్యాలయం ద్వారా సమస్య పరిష్కారం కావాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఎంతోమంది బాధితులు ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు జరగక విసిగిపోతుంటారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో, పాలనా యంత్రాంగం వాట్సాప్ మెసేజులను కూడా ఫిర్యాదులుగా భావించాల్సివుంటుంది. 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మనమిత్ర వాట్సాప్‌లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలని భావిస్తోంది. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగానే భావించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నిర్ణయంతో ఫిర్యాదుదారునికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరం తగ్గడమే కాకుండా, సమస్యల పరిష్కారంలో వేగం పెరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రక్రియలో భాగంగా, ముందుగా 11 ప్రధాన రకాల సేవలను డిజిటలైజ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా ఫిర్యాదులను స్వీకరించడం ద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా, అవినీతికి కూడా తావుండదని అంటున్నారు. ఏ ఫిర్యాదు ఎక్కడ పెండింగ్‌లో ఉంది? ఏ అధికారి స్పందిస్తున్నారు? అనే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. తద్వారా పాతకాలపు పద్ధతులకు స్వస్తి పలికి, ప్రజలకు జవాబుదారీగా ఉండే 'రియల్ టైమ్' గవర్నెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
డిజిటల్ సేవలు సక్రమంగా అందాలంటే నెట్‌వర్క్ వ్యవస్థ కీలకం అని గుర్తించిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల ప్రాంతాల్లో ఉన్న కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో ఈ ప్రాంతాల్లో మెరుగైన నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజలు తమ ఫోన్ ద్వారా ఫిర్యాదులను పంపే వీలు కలుగుతుంది. డిజిటల్ పరిజ్ఞానాన్ని కేవలం ఒక సాంకేతికతగా కాకుండా, ప్రజల కష్టాలను తీర్చే ఒక ఆయుధంగా ప్రభుత్వం మలుస్తోంది.
మొత్తంగా చూస్తే, వాట్సాప్‌లో ఫిర్యాదులు - తక్షణమే పరిష్కారాలు అనే నినాదం ఇప్పుడు ఏపీ పాలనలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆధునిక సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడం ద్వారా పారదర్శకతను, వేగవంతమైన సేవలను అందించే ఈ ప్రయత్నం విజయవంతమైతే, అది దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా నిలుస్తుందని అంటున్నారు. డిజిటల్ విప్లవంతో పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్న ప్రభుత్వం, ఫిర్యాదుల పరిష్కారంలో 'మనమిత్ర' ద్వారా ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.