స్థానిక ఎన్నికలకు ఎలా..? వైసీపీ కేడర్ లో అంతర్మథనం!

ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.;

Update: 2025-11-24 13:30 GMT

ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత పంచాయతీలకు ఆ తర్వాత కొంత సమయం తీసుకుని మున్సిపాలిటీలు, ఆ వెంటనే మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఏ ఇద్దరు కార్యకర్తలు కలుసుకున్నా కూడికలు, తీసివేతలు వేసుకుంటూ లెక్కలు వేస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే ఉత్సాహంతో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు కదన కుతూహలం ప్రదర్శిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోందని అంటున్నారు. ఆ పార్టీలో ఏ ఒక్కరు స్థానిక ఎన్నికల కోసం మాట్లాడటం లేదని అంటున్నారు.

గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో 99 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. అప్పట్లో అధికారం అండతో మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం అయ్యేలా ఆ పార్టీ నేతలు చక్రం తిప్పారని అంటున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నాయకులు, కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయినట్లు కనిపిస్తున్నారు. చాలా మంది గతంలో తాము వ్యవహరించిన విధానాలను గుర్తుకు తెచ్చుకుని.. ఇప్పుడు అధికార పార్టీ అదే తరహా రాజకీయం చేస్తుందా? అని సందేహిస్తున్నారు. అలా అయితే తాము అధికార కూటమిని ఎలా ఎదుర్కోగలమని అంతర్గత భేటీల్లో చర్చించుకుంటున్నారని అంటున్నారు.

గతంలో ఏకపక్ష విజయాలను సాధించిన వైసీపీ.. ఇప్పుడు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉందా? అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలపై ఆ పార్టీ అధిష్టానం నుంచి గానీ, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతల నుంచి కానీ ఇంతవరకు ఎలాంటి ముందస్తు సన్నాహాలు కనిపించడం లేదు. కనీసం స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై నియోజకవర్గ స్థాయిలో కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని అంటున్నారు. పార్టీలో ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లు నడుచుకుంటుండటం వల్ల.. గ్రామస్థాయిలో అధికార పార్టీతో పోరాటంపై వైసీపీ కేడర్ డైలమాలో పడిపోతోందని అంటున్నారు.

ఇక రాయలసీమ, పల్నాడు వంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో తాము నామినేషన్ వేసే అవకాశం కూడా ఉండకపోవచ్చని వైసీపీ కార్యకర్తలు ముందే కాడి వదిలేస్తున్న సంకేతాలిస్తున్నారని అంటున్నారు. పార్టీ అధిష్టానం అండ లేకపోతే స్థానిక ఎన్నికలపై తాము ఒక్క అడుగు ముందుకు వేయలేమని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే అధినేత జగన్ మాత్రం అసలు స్థానిక ఎన్నికలను ఏ మాత్రం సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. గతంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతోనే ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే ప్రతిపక్షానికి రక్షణ ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ స్పీడుతో సొంత స్థానాన్ని కూడా జగన్ నిలుపుకోలేకపోయారని అంటున్నారు. ఇది గుర్తించుకున్న వైసీపీ కేడర్.. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇంతకుమించు అదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో స్థానిక సమరం వైసీపీ కేడర్ ను తీవ్ర అంతర్మథనానికి గురిచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News