గెలుపు బాధ్యత మంత్రులదే...బాబు ఆదేశం
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది. బీసీ రిజర్వేషన్ల మీద సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో శనివారం ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీలకు అధికారికంగా న్యాయం చేసే విషయం మీద చర్చించారు. అదే సమయంలో ప్రభుత్వ పరంగా వారికి పూర్తి భరోసా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.
సిద్ధంగా ఉన్నాం :
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీల పరంగా కూటమి సిద్ధంగా ఉందని చంద్రబాబు ప్రకటించారు. స్థానిక సంస్థలను ధీటుగా ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక రాష్ట్ర మత్రి వర్గ సమావేశం ముగిసిన తరువాత చంద్రబాబు మంత్రులతో ఇష్టాగోష్టిగా నిర్వహించిన మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. కూటమి పార్టీల తరఫున నిలబడే అభ్యర్ధుల గెలుపు కోసం ఏ విధంగా ముందుకు సాగాలి అన్న దాని మీద ఆయన దిశా నిర్దేశం చేశారు.
మీదే బాధ్యత :
స్థానిక సంస్థలలో కూటమికి నూరు శాతం ఫలితాలు రావాలని మంత్రులకు బాబు సూచించారు. గెలుపు బాధ్యతను మంత్రులు అంతా సీరియస్ గా స్వీకరించాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా ఇంచార్జి మంత్రులు తమ జిల్లాలలో మొత్తం కో ఆర్డినేట్ చేసుకోవాలని కూడా ఆయన కోరారు. అన్ని పార్టీలను కలుపుకుని సాగాలని విజయమే లక్ష్యంగా వ్యూహ రచన చేయాలని కోరారు. మంత్రులు అంతా ఈ విషయంలో గట్టిగానే ఉండాలని బాబు సూచించారు.
అప్పటికి పూర్తి :
ఇక స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకుని మంత్రులు అంతా సిద్ధం కావాలని బాబు కోరారు. మంత్రులు ఇప్పటి కంటే మరింత చురుకుగా ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికలు నవంబర్ 15 నాటికి పూర్తి అవుతాయని చంద్రాబబు చెప్పారు. అనంతరం దైనందిన పాలనలోకి వెళ్ళడం జరుగుతుందని అన్నారు. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఏపీ మొత్తం ఎన్నికల కోడ్ పరిధిలోకి వెళ్తుంది. దాంతో రానున్న రోజులన్నీ కూడా ఎన్నికల వేడితో ఉంటుంది.
మంత్రులకు సవాల్ గా :
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అక్టోబర్ 12 నాటికి 28 నెలలు పూర్తి అవుతోంది. అంటే దాదాపుగా సగం పాలన అయినట్లు అన్న మాట. మంత్రుల పనితీరు మీద ఎప్పటికపుడు ముఖ్యమంత్రిగా కూటమి పెద్దగా చంద్రబాబు సూచనలు ఇస్తున్నారు. దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. అయితే సీఎం సూచనలను పాటించిన వారు పని తీరు మెరుగు పరచుకున్నారు. ఇంకా పని తీరు సరిగ్గా లేని వారి విషయంలో వేచి చూసే ధోరణిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని అంటున్నారు. ఇపుడు స్థానిక ఎన్నికలు అందరికీ ఒక సవాల్ అని చెబుతున్నారు. పాలనాపరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ముందుండి తమ జిల్లాలలో కూటమిని గెలిపించే విషయంలో ఎవరు ముందుంటారు అన్నది కూడా బేరీజు వేసుకుంటారని అంటున్నారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికలు మాత్రం మంత్రులకు పరీక్షంగానే చెబుతున్నారు. ఈ రేసులో ఏ మంత్రులు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.