విజయసాయి ఫీవర్.. ఈ రోజు రచ్చ.. రచ్చేనా?
నిజానికి వైసీపీలో విజయసాయిరెడ్డి నెంబర్ టు నేతగా వ్యవహరించేవారు. ఆ పార్టీ ఆవిర్భావానికి అధికారంలోకి వచ్చేందుకు తెరవెనుక ఎంతో కష్టపడ్డారు.;
ఏపీ లిక్కర్ స్కాం విచారణ ఊపందుకుంది. ప్రతిపక్ష వైసీపీయే టార్గెట్ గా కొనసాగుతున్న విచారణలో సిట్ అధికారులు నెక్ట్స్ స్టెప్ ఏంటి? అన్న టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీలో కొందరు ముఖ్యనేతలకు ఈ స్కాంతో సంబంధం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ నేతల పాత్రపై ఎటువంటి ఆధారాలు సేకరించింది ప్రభుత్వం చెప్పడం లేదు. కానీ, వైసీపీ నేతలే పాత్రధారులు, సూత్రధారులు అంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు వైసీపీ నేతలను ఇరికించేలా ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో సిట్ విచారణకు వస్తున్న విజయసాయిరెడ్డి ఏం చెబుతారు? ఎవరిని ఇరికిస్తారనేది వైసీపీలో దడ పుట్టిస్తోంది.
నిజానికి వైసీపీలో విజయసాయిరెడ్డి నెంబర్ టు నేతగా వ్యవహరించేవారు. ఆ పార్టీ ఆవిర్భావానికి అధికారంలోకి వచ్చేందుకు తెరవెనుక ఎంతో కష్టపడ్డారు. అధినేత జగన్ ను ప్రజల ముందు ఉంచి పార్టీకి బ్యాక్ గ్రౌండు చేసేవారు. ఈ క్రమంలోనే వైసీపీలో లీడర్లు, కార్యకర్తలకు విజయసాయిరెడ్డి మాటే వేద వాక్కులా భావించేవారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర బాగా తగ్గిపోయింది. ఇక అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడే వరకు విజయసాయిరెడ్డితో అధినాయకత్వానికి గ్యాప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత తన వ్యూహానికి పదును పెట్టినట్లు చెబుతున్నారు.
వైసీపీ ఎదుగుదలకు తాను ఎంతో కష్టపడినా, కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లినా కూడా తనకు సరైన గౌరవం దక్కలేదని విజయసాయిరెడ్డి రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత జగన్ చుట్టూ చేరిన కోటరీ తనను అవమానించిందని ప్రకటించి కలకలం రేపారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ప్రముఖ నేతలుగా చెలామణి అవుతున్న వారిని టార్గెట్ చేసేలా విజయసాయిరెడ్డి మాటల తూటాలు పేల్చుతున్నారు. అధినేత జగన్ అంటే తనకు ఇప్పటికీ ఇష్టమంటూనే ఆయన చుట్టూ ఉన్నవారికి ఉచ్చు బిగించేలా విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయం అంతుచిక్కడం లేదు. గత నెల కాకినాడ సీపోర్టు కేసులో విచారణకు వెళ్లినప్పుడు మీడియా ముందు లిక్కర్ స్కాంపై విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన సంచలనం రేపింది. అప్పటి నుంచి ప్రభుత్వానికి కూడా ఓ అస్త్రం లభించిందని అంటున్నారు.
తాను సురక్షితంగా బయటపడాలని చూస్తున్నారో.. లేక తనకు అన్యాయం చేసిన వారిని ఇరికించేలా పావులు కదుపుతున్నారో కానీ విజయసాయిరెడ్డి వ్యూహం మాత్రం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అంటున్నారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని గతంలో ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి ఈ రోజు పోలీసుల ఎదుట హాజరవుతున్నారు. ఈ కేసులో ఇంతవరకు నిందితుడిగా భావించిన విజయసాయిరెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించిందని అంటున్నారు. విజయసాయిరెడ్డి సహకరిస్తే మొత్తం స్కాం గుట్టురట్టు చేయొచ్చని సిట్ నమ్ముతోంది. అందుకే విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి అధిక ప్రాధాన్యమిస్తోందని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి మాత్రమే లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంటూ ప్రకటించిన విజయసాయిరెడ్డి ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు ఇస్తారో అంతుచిక్కడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఏం చెబుతారనేది ఉత్కంఠ రేపుతోంది. మరీ ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విజయసాయిరెడ్డి పేరు చెబితేనే వణికిపోతున్నారని అంటున్నారు.